BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకపురంలో గ్రామానికి చెందిన రైతు అంబటి సాంబయ్య ఎద్దు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయింది. తన వ్యవసాయ పొలం వద్ద ఎద్దులను మేత మేయిస్తుండగా విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి చెందింది. సుమారు లక్షా ఇరవై వేల రూపాయల విలువ గల ఎద్దు మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు.
JGL: ఇబ్రహీంపట్నం వర్షకొండ గ్రామంలోని కొన్ని రోజులుగా విద్యుత్ కోత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట చివరి దశలో ఉన్నందున పంటకు నీరు అవసరమని గ్రామస్థులు తెలిపారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని రైతులు కోరారు. విద్యుత్ కోత ఇలాగే కొనసాగితే సబ్ స్టేషన్ ను ముట్టడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.
SRD: సింగూర్ ప్రాజెక్టుకు వరద బాగా తగ్గింది. దాంతో ఇవాళ ప్రాజెక్టు మూడు గేట్లు క్లోజ్ చేసినట్లు ప్రాజెక్టు AEE జాన్స్ స్టాలిన్ గురువారం సాయంత్రం తెలిపారు. యావరేజ్ ఇన్ ఫ్లో 9,438 క్యూసెక్కులు కాగా, ఓపెన్ ఉన్న ఒక్క గేట్ ద్వారా 9,633 క్యూసెక్కులు, జెన్కో విద్యుత్ ఉత్పత్తికి 2200 క్యూసెక్కులు రిలీజ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నీటిమట్టం 16.952TMC లకు చేరింది.
JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. కుక్కలు పశువులను కరుస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందారు. దీనిపై ఏ వై ఎస్ యూత్ ఇచ్చిన ఫిర్యాదుకు గ్రామ కార్యదర్శి ప్రవీణ్ తక్షణమే స్పందించారు. కార్యదర్శి ఆదేశాల మేరకు గ్రామంలో కుక్కలను నిర్బంధించి, సమస్యకు చెక్ పెట్టారు. సత్వర చర్యలు చేపట్టిన కార్యదర్శికి కృతజ్ఞతలు చెప్పారు.
HYD: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా GHMC ప్రధాన కార్యాలయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ కర్ణన్ ప్రారంభించారు. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో కంట్రోల్ రూమ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
KNR: ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాలో భాగంగా ఈ నెల 13న కరీంనగర్ ప్రభుత్వ ఐటిఐలో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తునట్లు ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డిజిల్ మెకానిక్, తదితర కోర్సులో పాస్ అయిన అభ్యర్థులు అర్హులని, ఎంపికైనా వారికి రూ.15 వేల రూపాయిల స్టయిఫండ్ చెల్లిస్తారని అన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SRCL: రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యమని కలెక్టర్ ఎం. హరిత స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, రవాణా, మార్కెటింగ్, సహకార, ఐకేపీ, మెప్మా ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
JN: ప్రపంచ మెంటల్ హెల్త్ డే సందర్భంగా తరిగొప్పుల కస్తూరిబా గాంధీ బాలికల స్కూల్‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలకు ఆరోగ్య జీవనం, పౌష్టికాహారం, వ్యాయామం, చదువు, సెల్ ఫోన్ పరిమితి, పోక్సో చట్టం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై సీనియర్ సివిల్ జడ్జ్ విక్రమ్ అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
WGL: జిల్లా కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) వెల్నెస్ సెంటర్ స్థాపనకు కాజీపేట డివిజన్ మున్సిపల్ కార్యాలయం, దూరదర్శన్ కార్యాలయం, వరంగల్ పాత కలెక్టర్ వసతి గృహాన్ని గురువారం MP కడియం కావ్య, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. భవనం ఎంపికను తక్షణమే పూర్తి చేసి, సెంటర్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.
BHNG: మోటకొండూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు, అభ్యర్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఫర్నిచర్, భద్రతా చర్యలను తనిఖీ చేశారు.
ADB: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలపై నెలకొన్న సందిగ్దతకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రిజర్వేషన్ల పేరిట మభ్యపెడుతూ.. బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
JN: సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో జనగాం జిల్లా బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ చేతుల మీదుగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అవార్డు స్వీకరించారు. RTI దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించినందుకు ఈ గుర్తింపు లభించింది.
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట్, బెజ్జూర్ మండలం కుకుడా గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు గురువారం BJP లో చేరారు. వీరికి సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి పని చేయాలని తెలిపారు.
HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్ఎం (LLM) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్ఎల్ఎం రెండో, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ మరియు అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
SDPT: గజ్వేల్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలు పాటించడం సహించక బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.