ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలకు గాను మరప్పగూడ, నాగల్కొండ, బలాన్పూర్, బేతల్ గూడ, మాన్కపూర్, నార్నూర్, భీంపూర్, కొత్తపల్లి, మలంగి, మాలేపూర్, ఉమ్రి జీపీల వార్డు సభ్యులకు సోమవారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు MPO మహేష్ తెలిపారు. ఈనెల 28వ తేదీన శిక్షణ ముగియనుందన్నారు. నార్నూర్ రైతువేదికలో నిర్వహించే 5 రోజుల ట్రైనింగుకు రావాలన్నారు.
MDCL: ఉప్పల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నేతలను ఉప్పల్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. చిలుకానగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ నేత తెలంగాణ సంపత్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యలతో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
KNR: ఇల్లందకుంట మండలం సిరిసేడు-మాల్యాల రోడ్డు బురదమయంగా మారింది. దీంతో రైతులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. గతంలో మంజూరైన 2.5 కి.మీ తారు రోడ్డు పనులు పూర్తి కాకముందే నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు పూర్తయితే ప్రయాణికులకు 3 కి.మీ ప్రయాణ భారం తగ్గుతుంది.
ASF: వినియోగదారుల సౌలభ్యం కోసం సోమవారం జిల్లా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా SE ఉత్తమ్ జాడే ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఫిర్యాదులు స్వీకరించి సమస్యల తీవ్రతకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు.
SRPT: సమగ్ర శిక్ష పథకం కింద సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై నేటి నుంచి 25 వరకు నడిగూడెం మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు డబ్బు విలువ, పొదుపు అలవాట్లు, బాధ్యతాయుతమైన ఆర్ధిక ప్రవర్తనపై అవగాహన కల్పించాలనేది దీని ఉద్దేశం.
మంచిర్యాల జిల్లా పెఱిక యువజన సంఘం ఎన్నికలలో బెల్లంపల్లి పట్టణనికి చెందిన బోడకుంట సాగర్‌ని జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాగర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు రాష్ట్ర నాయకత్వనికి, జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
KMM: చింతకాని మండలంలో సోమవారం తెల్లవారుజామున బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపుతో కాంగ్రెస్ హామీల అమలుపై చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మండల అధ్యక్షుడు కొండా గోపి, ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్యను పోలీసులు ఇంటివద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అకౌంటింగ్ విభాగం అధికారులకు ఆదేశించారు. ఈనెల 25న బడ్జెట్ ఆమోదం కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలకవర్గం పదవీకాలం మరో నెలలో ముగియనున్న నేపథ్యంలో ఇది చివరి బడ్జెట్ సమావేశంగా నిలవనుంది.
NZB: రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట(D) నర్మెట సభలో మాట్లాడారు. రైతులు మిల్లెట్స్ ఆర్గానిక్, కాయగూరలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ సాగు లాభదాయకని, ఆదాయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
MBNR: మిడ్జిల్ మండలం వస్పుల హైస్కూల్ 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మురళి, ఆంజనేయులు, శేఖర్, భారత్, నరేష్, శశికాంత్ తదితర విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.
KNR: మానకొండూరు మండలంలోని కొండపలకల గ్రామంలో ప్రపంచ జల మహోత్సవ పక్వాడ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక సారధి వడ్లకొండ అనిల్ కుమార్ బృందం నీటి వినియోగం, వృథా నీటిని అరికట్టడం తదితర అంశాలపై సాంస్కృతిక సారధి కళాబృందం పాటలు పాడుతూ.. ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, మండల అధికారులు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.
GDWL: జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని, పోలీస్ శాఖ పటిష్ట భద్రత కల్పించాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు.
SRPT: గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, ట్రాక్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే బ్రిడ్జి వద్ద వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు ఆదివారం సాయంత్రం పాల్వంచ మండలం అరేపల్లి గ్రామ పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. సింగరాయపల్లి గ్రామానికి చెందిన చెన్నం నారాయణరెడ్డి అనే వ్యక్తి అరేపల్లి వాగు నుంచి అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు చేశారు.
SRD: సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటలకు డప్పు నరేష్ (22)పై గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నరేష్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో కంది 108 సిబ్బంది ఈఎంటీ చిరంజీవి, పైలెట్ రమేష్‌లు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.