NGKL: జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీసీసీఎఫ్ సువర్ణ పర్యటనలో భాగంగా ఫరాహాబాద్ వ్యూ పాయింట్ వద్ద పులి దర్శనమివ్వగా, మరొకటి గుండం వద్ద సేదతీరుతూ కనిపించింది. తాజా గణాంకాల ప్రకారం ఇక్కడ పులుల సంఖ్య 40 దాటినట్లు తెలుస్తోంది. మెరుగైన సంరక్షణ చర్యల వల్ల పులులకు ఈ అడవి సురక్షిత నిలయంగా మారింది.
MDK: టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామంలోని గ్రామ దేవతలకు ఆదివారం రాత్రి గ్రామ ప్రజలు ఘనంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. 5 రోజులు సాగే గ్రామ దేవత జాతర ఉత్సవాలకు మొదటి రోజు గ్రామస్థుల సమక్షంలో బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామ దేవత దుర్గమ్మ, పోచమ్మలకు బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
HYD: అత్తాపూర్ పరిధిలోని చింతల్‌మెట్లలో గంజాయి మత్తులో గ్యాంగ్ హింసకు దిగింది. ఓ యువకుడిపై కత్తితో దాడి చేయగా, అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మందలించిన స్థానికులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించి, ఓ ఇంటి తలుపునకు నిప్పంటించారు. పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
PDPL: పెద్దపల్లి కార్మిక అధికారిణి హేమలత తీరుపై భవన నిర్మాణ కార్మికులు ఆదివారం మంత్రి వివేక్ వెంకట స్వామికి ఫిర్యాదు చేశారు. కార్మికులకు న్యాయం చేయాల్సిన అధికారిణి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చెన్నూర్‌లో కార్మిక, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి దళిత బహుజన లేబర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.
KMM: జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిన్న ప్రముఖ సాహితీవేత్త నామ రామారావు రచించిన నామా పద్యాలు- నిత్య సత్యాలు సాహితీ సంకలనాన్ని ఎమ్మెల్సీ తాతా మధు ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, ఫేమా కన్వీనర్, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు.
SRCL: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో వేములవాడ పట్టణంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను బీజేపీ నాయకులు ఖండించారు.
MHBD: ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చ నాయక్ ఇటీవల మృతి చెందగా, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్‌ను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
JGL: అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 1,065 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, ఇందులో 1,037 ప్రధాన కేంద్రాలు, 28 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ఇదివరకే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పాతబడగా కొత్త ఫోన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజు పోషణ్ ట్రాకర్ యాప్‌లో 14 రకాల వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
KNR: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన పల్లె రవి అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. రోజువారి విధుల్లో భాగంగా చెట్టు ఎక్కిన రవి దిగే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. సహచరులు వెంటనే గమనించి 108 అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్‌కు తరలించారు.
ASF: కెరమెరిలోని సాకడ ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై మధుకర్ ఆదివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
GDWL: ఊట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. తనిఖీలలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాణిక్యప్ప, కురుమూర్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
హైదరాబాద్‌లోని చాదరాఘాట్‌లో చార్మినార్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. స్టెరాయిడ్స్ ముఠా గుట్టురట్టు చేసి,20 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో షేక్ సమీర్, వసీం ఖాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.
MBNR: బాలానగర్‌లో ఫోన్ హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు రూ.50 వేలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు రవి తెలిపిన వివరాలు.. ఫోన్ స్క్రీన్ గీతలు వచ్చి స్విచ్ ఆఫ్ అయింది. తిరిగి ఆన్ చేసి చూడగా ఖాతాలోని నగదు మాయమైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని లింకులు, యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
MNCL: తాండూర్ మండలం అచ్చులాపూర్‌కి చెందిన కొండపెల్లి బయమ్మ అనే వృద్ధురాలిపై ఆదివారం రాత్రి పిచ్చి కుక్కలు దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.
SRD: ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను జోగిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రూ.2.50 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. నేరడిగుంటలో ప్రాథమిక కేంద్రం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మంత్రి చొరవతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నేరవేరిందని పేర్కొన్నారు.