BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్‌ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
NGKL: అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలోని ఒక ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు పూజలు చేసి ఒక ఇంటి ముందు మెట్లపై పాము బొమ్మ, పసుపు కుంకుమ, బియ్యం, నిమ్మకాయలు, కోడి కట్టి వేశారు. గమనించిన కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
JGL: వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు, కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. ఉచిత శిక్షణలను వినియోగించుకొని యువత ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని సూచించారు.సేవా భారతి ఎన్నో ఏళ్లుగా నిరుపేదలకు విద్య,ఉపాధి శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.
నిర్మల్: విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం నిర్మల్‌లోని చాణక్య స్కూల్ 9వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపల్ హరీష్ బూటుకాళ్లతో కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్సకు రూ. 2 లక్షలు ఖర్చయ్యాయని అతడి తండ్రి తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని LHPS నేతలతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
KNR: గంగాధర మండల కేంద్రంలో వరి పంట పొలాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్ పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ముందు జాగ్రత్తగా ఐసొప్రోత్రయోలిన్ 1.5ml /లీటర్ నీటికి లేదా కాసుగా మైసిన్ 2ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
HNK: వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పైప్‌లైన్ల లీకేజీలను తక్షణమే అరికట్టాలని, రిజర్వాయర్లలో నీటి స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
VKB: నవాబ్‌పేట మండలం ఎల్లకొండ సమీపంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణిని(45) గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
SRCL: చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసి వేశారు. ఆలయ అర్చకులు వేకువ జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణం ముగిసి న అనంతరం సాయంత్రం 7.15 గంటలకు పుణ్యాహవచనం నిర్వహిం చి, ఆలయం అంతట సంప్రోక్షణ చేపట్టి, తెరుస్తామన్నారు.
పెద్దపల్లి: మండలంలోని అందుగులపల్లి గ్రామ రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉపసర్పంచ్ స్వప్న అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
MLG: హోలీ పండుగ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు, అధికారులకు రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. రసాయనిక రంగులు వాడకుండా సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగించాలని, ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు నిర్వహించాలని కోరారు.
ADB: భారత ప్రజారోగ్య ప్రమాణాల హామీల అమలులో భాగంగా 100 రోజుల పాటు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DMHO నరేందర్ రాథోడ్ తెలిపారు. ఆదిలాబాద్ DMHO కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 4న ప్రారంభంకానున్న 100 రోజుల ఆరోగ్య కార్యక్రమాల వివరాల MLHP, MOలు, పర్యవేక్షణ సిబ్బందికి శిక్షణ అందించారు.
KNR: ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ కరీంనగర్ మున్సిపల్ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతికి స్వస్తి పలకాలని, నిబంధనల ప్రకారం ఇళ్ల అనుమతులు సులభతరం చేయాలని ఆయన ఆదేశించారు. నిజాయితీగా పనిచేసే వారికి అండగా ఉంటానని, హామీ ఇచ్చారు.
GDWL: గ్రహణ కాలంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేయడం సంప్రదాయం అని ఆలయ ఈవో పురందర్ కుమార్ పేర్కొన్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకే గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత, బుధవారం తెల్లవారుజామున 6 తెరుస్తామన్నారు.
MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో సర్పంచ్ ఉల్లి నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో లార్వా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని కాలువలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో లార్విసైడ్ మందులను పిచికారీ చేయించారు. వారం రోజుల పాటు సాగే ఈ డ్రైవ్లో భాగంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
RR: షాద్‌నగర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనతో పోలీస్ సేవలపై స్పష్టత పెరిగింది.