నాగర్‌కర్నూల్ జిల్లాలో వేపచెట్లను కీటకాలు, శిలీంద్రాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆకులు రంగుమారి రాలిపోతూ, కొమ్మలు ఎండిపోతున్నాయి. పూత, కాయలు రావడం నిలిచిపోయి, చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. నిపుణులు ప్రతికూల వాతావరణ కారణంగా తెగులు వ్యాప్తి చెందుతున్నాయని, వాటిని కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
KMM: ముదిగొండలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల శిక్షణా తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. మండలంలోని 126 మంది వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామాల్లో సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.
BDK: సుజాతనగర్ మండలం వేపలగడ్డ మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్ని బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటశాల, విద్యార్థుల తరగతి గదులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు.
KNR: జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. పరస్పర స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు, చిన్నారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ASF: బెజ్జుర్ మండలం సలుగుపెల్లి X రోడ్డు వద్ద SI సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఎస్ఐ సూచించారు.
SRD: యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలనీ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. బుధవారం సహచర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి సింగూర్ డామ్ పై సమీక్షించారు. సింగూరు ప్రాజెక్టు సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేసి జులై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించాలన్నారు.
HNK: టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్లో లైన్ మెన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజినీర్ పి.మధుసూదన్ రావు అమరవీరుల స్తూపం వద్ద శాఖాధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజినీర్లు ఏ.విజయేందర్ రెడ్డి, జి.సాంబారెడ్డి, పి.మల్లికార్జున్ తదితర అధికారులు పాల్గొన్నారు.
KMR: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన కొర్వి సాయిలు తీవ్ర అనారోగ్యంతో శస్త్రచికిత్స అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా బుధవారం MLA మదన్ మోహన్ వెంటనే స్పందించారు. ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ. 2,50,000 లక్షల LOC మంజూరు చేయించారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యేకు సాయిలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
MDK: నార్సింగి మండల ఇంఛార్జ్ ఎంపీడీవోగా చెన్నారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
KMM: చింతకాని మండలం తిరుమలాపురం అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం సర్పంచ్ చాపలమడుగు వీరబాబు సందర్శించారు. కేంద్ర నిర్వహణ, చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు బాలామృతం, కోడిగుడ్లు పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో క్రాస్ రోడ్ నుంచి పాత ఊరు వరకు ఏర్పాటు చేసిన సోలార్ ఐమాస్ట్ లైట్లు కొన్ని స్తంభాలకు వేలాడుతూ, మరి కొన్ని స్తంభాలకు పని చేయకుండా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో రహదారంతా చీకటి అలుముకుని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున, అధికారులు స్పందించి వాటి స్థానంలో నూతన లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
NZB: జాతీయ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏఈ చంద్రశేఖర్ అధ్యక్షతన లైన్‌మెన్ దినోత్సవాన్ని సిరికొండ సబ్ స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గల ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం హోలీ పండుగ సందర్భంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరారు. సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో వాహనాలు అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని బాటసారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NRML: నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను సకాలంలో అందజేయాలని సీనియర్ ఆడిటర్ చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను రసీదులతో సహా సమర్పించాలని తెలిపారు. ఖర్చుల వివరాలను సమర్పించని వారికి నోటీసులను అందజేస్తామని తెలిపారు.