• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని వినతి

BHNG: జిల్లాలోని నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల శిక్షణ కోసం ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని AIYF డిమాండ్ చేసింది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజావాణి’లో కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. AIYF జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఏల్లంకి మహేష్, మహేందర్ మాట్లాడుతూ.. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యావంతులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఉపయోగపడతాయని అన్నారు.

March 9, 2026 / 07:07 PM IST

ఈ నెల 14న బండి సంజయ్ ”అంజన్న ఆశీర్వాద యాత్ర”

KNR : ఈనెల 14న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ “అంజన్న ఆశీర్వాద యాత్ర” పేరిట మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.కరీంనగర్ పార్లమెంట్ పcరిధిలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో చేపట్టనున్నారు

March 9, 2026 / 07:06 PM IST

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రేపు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు చింతపల్లి మండలం తీదేడులో భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. 10 గంటలకు జాల్ తండాలో ‘ప్రజా పాలన-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తారు. అనంతరం 11:30 గంటలకు క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహిస్తారు.

March 9, 2026 / 07:05 PM IST

మంత్రి జూపల్లిని కలిసిన ఫైర్ సిబ్బంది

NGKL: కొల్లాపూర్ ఫైర్ స్టేషన్‌కు సరైన రహదారి, నీటి సౌకర్యం కల్పించాలని ఇవాళ స్టేషన్మ సిబ్బంది మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఫైర్ కానిస్టేబుల్ గుణమోని చరణ్ మాట్లాడుతూ.. రోడ్డు సరిగా లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.

March 9, 2026 / 07:05 PM IST

ఆడుకుంటున్న చిన్నారిపై పిచ్చికుక్కల దాడి

MNCL: తాండూరు మండలం రేచిని గ్రామంలో ముదుగిరి అద్విక శ్రీ(3)పై పిచ్చికుక్కలు దాడి చేశాయి. సోమవారం ఇంటి బయట ఆడుకుంటుండగా పిచ్చి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయగా చిన్నారి గాయపడింది. కుటుంబీకులు వెంటనే బెల్లంపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల మాత శిశు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 9, 2026 / 07:04 PM IST

మెగా రైతు మేళాకు జిల్లా పట్టు రైతులు…

SDPT: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నిర్వహించిన మెగా రైతు మేళాకు సోమవారం సిద్దిపేట జిల్లా పట్టు రైతులు తరలి వెళ్లారు. పట్టు పరిశ్రమ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పలు స్టాల్స్‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

March 9, 2026 / 07:01 PM IST

పరిశుభ్రత పర్యావరణంపై గ్రామస్తులకు అవగాహన

NLG: “ప్రజా పాలన-ప్రగతి పాలన”లో భాగంగా చిట్యాల మండలం, చిన్నకాపర్తిలో గ్రామస్తులకు పర్యావరణంపై ఇవాళ అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, సర్పంచ్ ఆవుల సుందరయ్య, కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ పాల్గొన్నారు.

March 9, 2026 / 07:01 PM IST

పునరావాసం కల్పించాలని మంత్రికి వినతి

NRPT: మాగనూరు మండలంలోని నేరేడుగం, భూత్పూర్ గ్రామస్థులకు తక్షణమే పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. సర్వం కోల్పోయి నిర్వాసితులైన తమను ఆదుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.

March 9, 2026 / 07:01 PM IST

‘ప్రజా పాలన ప్రగతి’ ప్రణాళికలో భాగంగా శుభ్రత డ్రైవ్

SRPT: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం 99 రోజుల ‘ప్రజా పాలన–ప్రగతి’ ప్రణాళికలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. 13, 15, 16 వార్డుల్లో చెత్త తొలగింపు, పరిసరాల శుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈ-వేస్ట్ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బీ. శ్రీనివాస్, ఏఈ వినోద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం. అశోక్ పాల్గొన్నారు.

March 9, 2026 / 06:58 PM IST

ఈ 12న కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీల లెక్కింపు గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి నగదు, బియ్యం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి (ఈవో ) కోరారు.

March 9, 2026 / 06:56 PM IST

జిష్ణు దేవ్ వర్మకు వీడ్కోలు పలికిన సీఎస్

HYD: మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు బదిలీపై వెళ్తున్న జిష్ణు దేవ్ వర్మకి బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

March 9, 2026 / 06:56 PM IST

‘విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి’

BDK: మణుగూరు మహాత్మా పూలే గురుకుల పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు.

March 9, 2026 / 06:55 PM IST

‘ప్రజావాణి’ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

SRPT: ‘ప్రజావాణి’లో వచ్చే దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి ఆయన ప్రజల నుంచి 83 అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, ఇతర వ్యక్తిగత సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

March 9, 2026 / 06:53 PM IST

బీరవెల్లిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పన

NRML: తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో సోమవారం, సైబర్ నేరాలపై బ్యాంకు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంచార వాహనం ఏర్పాటు చేసి, నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు, సైబర్ నేరాలపై అప్రమత్తత, బ్యాంకింగ్ వ్యవస్థతో ముడిపడి ఉన్న వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

March 9, 2026 / 06:47 PM IST

‘ఉద్యోగ కల్పనలో ప్రభుత్వాలు విఫలం’

NRPT: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.

March 9, 2026 / 06:30 PM IST