JGL: ధర్మపురిలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి కుంగు ఫూ కరాటే ఛాంపియన్ పోటీలలో జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన కుజ్జఫు రాధ వెంకటేశ్వర్లు బ్లాక్ బెల్ట్ ఉత్తమ రిఫరీ అవార్డు అందుకున్నారు. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసి అతనికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ రాజమల్లు, ప్రవీణ్ పాల్గొన్నారు.
జనగాం: జాఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ ఫేజ్ వైరు కాలిపోవడంతో బోరు మోటార్లు పనిచేయకుండా పోయాయి. దీంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు, లైన్‌మెన్‌కు సమస్య తెలియజేసినా ఎవరూ స్పందించలేదని రైతులు ఆరోపించారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతుల డిమాండ్ చేశారు.
HNK: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సర్పంచ్ రేణుక కుమారస్వామి అన్నారు. నారాయణగిరి గ్రామంలో ఉదయం సర్పంచ్ పారిశుధ్య సిబ్బందితో కలిసి స్వయంగా పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో మంగళవారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,260 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21,700 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.36వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.18,900, ఎల్లో మిర్చికి రూ.21,500 ధర వచ్చింది. మంచి ధర వస్తుండటంతో మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
KNR: కరీంనగర్ రూరల్ పోలీసులు పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షేడ్‌కు చెందిన ప్రవీణ్, మహేశ్, శంకర్ నల్లగుంటపల్లిలో రైతు స్వామికి చెందిన గేదెను దొంగిలించారు. బొమ్మకల్ వద్ద వారిని అదుపులోకి తీసుకుని రూ.55 వేల విలువైన గేదెను స్వాధీనం చేసుకున్నారు.
SRPT: చింతలపాలెం గ్రామపంచాయతీ భవనం వద్ద 2017లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై పెయింట్ వేయడం స్థానికంగా కలకలం రేపింది. సర్పంచ్ కక్షపూరిత రాజకీయాలతోనే కావాలని ఇలా చేశారని సీపీఐ నాయకుడు చిత్తలూరి వీరబాబు ఆరోపించారు. శిలాఫలకాన్ని కప్పివేయడం సరికాదని, వెంటనే అధికారులు స్పందించి దానిని పాత స్థితికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ADB: మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి SGF అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలురు సత్తా చాటారు. సోమవారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో నిజామాబాద్ జిల్లా జట్టును ఓడించి, ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు గోల్డ్ మెడల్ సాధించినట్లు SGF సెక్రెటరీలు వెంకటేష్, యాకుబ్ తెలిపారు.
WNP: గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలపరచిన ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ వనపర్తి మండలంలో గ్రామస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించిన విషయాలను కార్యకర్తల సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు.
వరంగల్: కళాసేవను నమ్ముకుని వివిధ కార్యక్రమాలు చేపట్టిన నర్సంపేట[M] బాలాజీపేట గ్రామానికి చెందిన పల్లె రాములుకి అరుదైన గౌరవం దక్కింది. కళారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, తెలంగాణ యాస, బాషలతో తనదైన పద్దతిలో పల్లే బతుకులను ప్రపంచానికి చాటిచెప్పుతున్న పల్లె రాములు తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఉత్తమ హస్యనటుడిగా ఎంపియ్యారు.
NZB: ఇండియా, మలేషియా అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో పాల్గొని భారతదేశానికి బంగారు పతకం సాధించిన జిల్లా క్రీడాకారుడు రాసరి అనిల్ కుమార్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని భారతదేశానికి బంగారు పథకాన్ని అందించడం గర్వించదగ్గ విషయమన్నారు.
BHPL: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ BHPL జిల్లా కన్వీనర్‌గా లక్కిరెడ్డి నరసింహ రెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు, జిల్లాలో బలమైన పునాది వేయడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా నేతలు ఆయనకు నియామక పత్రం అందజేశారు.
SRCL: ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో 99 రోజుల కార్యక్రమాల అమలుపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు కార్యాలయాల్లో స్వచ్ఛత.. పరిశుభ్రత పనులు పక్కాగా చేయాలని కలెక్టర్ సూచించారు.
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం నాలుగో విడతలో భాగంగా మంగళవారం 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 12.481 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నీటితో ఆయా పరిధిలోని రైతులు పంట సాగుకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
NLG: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశువైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,25,869 తెల్లజాతి, 3,17,279 నల్లజాతి పశువులకు టీకాలను వేయనున్నారు. 3 నెలల వయస్సు నిండిన వాటికి టీకాలు వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ తెలిపారు.
WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో 2,689 నల్ల పైపులు, రూ. 2 లక్షల విలువైన నల్ల పైపుల దొంగతనానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 9వ తేదీన పోలీస్ స్టేషన్‌లో మిషన్ భగీరథ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తి వివరాలు మాత్రం రాకపోవడంతో నల్ల పైపుల దొంగలు ఎవరని వర్ధన్నపేట మండలంలో చర్చనీయాంశంగా మారింది.