NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జూనియర్ కళాశాలలో 302 విద్యార్థులకు గాను ముగ్గురు, ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో 180 విద్యార్థులకు గాను ఒక్కరు గైర్హాజరైనట్లు GNC ప్రిన్సిపల్ శ్రీనాథ్, MJC ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు.
BHNG: మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో మూల మలుపు వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
HYD: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ వైపు సెంట్రో మాల్ సమీపంలో కారు బ్రేక్ డౌన్ కావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మందగించింది. పరిస్థితిని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పర్యవేక్షిస్తూ వాహనాన్ని తొలగించే చర్యలు చేపట్టింది. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించి ట్రాఫిక్ సిబ్బంది సూచనలు పాటించాలని, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించింది.
NLG: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రుద్రవరం పిచ్చమ్మకు ఇవాళ సీపీఎం నేతలు నివాళులర్పించారు. జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, బొబ్బలి సుధాకర్ రెడ్డి, చొప్పరి మల్లేశం, సరోజ, సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
సూర్యాపేట: ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలోని ప్రగతి హైస్కూల్లో రోడ్డు భద్రతపై ఎస్సై రవీందర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడప వద్దన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ADB: నేరడిగొండ మండలంలోని లఖంపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో సైన్స్ ల్యాబ్, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ నగేష్‌తో కలిసి భూమిపూజ చేశారు. రూ. 80 లక్షలతో సిబ్బంది గృహాలు రూ. 21లక్షలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
KMR: నాగిరెడ్డిపేట్ మండలంలో మండల పంచాయితీ అధికారిగా విధులు నిర్వర్తించిన ప్రభాకర చారి డిప్యూటేషన్‌పై ఎల్లారెడ్డి మండలానికి వచ్చారు. ఎల్లారెడ్డి మండలంలో మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించిన ఏ.ప్రకాష్ నాగిరెడ్డిపేట మండలానికి డిప్యూటేషన్‌పై వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు అధికారులకు ఉన్నత అధికారులు డిప్యూటేషన్‌పై నియమించారు.
KNR: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. కాచాపూర్ గ్రామ శివారులో వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన సంఘీ రాజు, నేదురు కనకయ్యలు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు.
SRPT: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో దళితులపై దాడి చేసి, రెండు నెలల పసిబిడ్డ ప్రాణాలు తీసిన నిందితులను ఉరితీయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్ డిమాండ్ చేశారు. నేడు సూర్యాపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలో ఇంతటి అమానుషం జరిగినా ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదన్నారు.
వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా స్థానిక సంస్థల పనితీరును మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలులో పారదర్శకత ఉండేలా కృషి చేస్తానని చెప్పారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ గ్రీవెన్స్ సెల్ నోడల్ ఆఫీసర్గా డాక్టర్ యస్. రవికుమార్ నియమితులయ్యారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేశ్ బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ నియామకం చేపట్టబడిందని యూనివర్సిటీ వెల్లడించింది. తోటి అధ్యాపకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
NRPT: ముదిరాజులను బీసీ డీ గ్రూపు నుండి బీసీఏ గ్రూపులోకి మార్చాలని పాలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ప్రభుత్వం ముదిరాజులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చందు, మొగులప్ప, నారాయణ, చంద్రశేఖర్, పటేల్ శీను ఉన్నారు.
మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి, ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పాలనాపరమైన అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తహసీల్దార్ వివరించారు.
BDK: భద్రాద్రి రామాలయంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కళ్యాణం జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
MDCL: ఘట్‌కేసర్‌లో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మరో వ్యక్తి ప్రాణం తీశాయి. భార్య పేరుతో లోన్ యాప్‌లో రుణం తీసుకున్న ఆటో డ్రైవర్ సాయికుమార్ (35), సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెంట్ల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. భార్య ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.