BHNG: మోత్కూరు మున్సిపాలిటీ 12వ వార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలు, కంప చెట్ల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వార్డు కౌన్సిలర్ మెంట రమణ వెంటనే పరిష్కరించారు. స్థానికుల విన్నపం మేరకు స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకున్న కౌన్సిలర్ JCB సహాయంతో మొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. ప్రజా సమస్యలపై సకాలంలో స్పందించిన కౌన్సిలర్‌ను వార్డు ప్రజలు అభినందిస్తున్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమీనాపురం (హన్మంతరావు) కాలనీకి చెందిన రాజు- సునీత దంపతుల రెండవ కుమార్తె కృప డెంగ్యూ బారినపడి కన్ను మూసింది. సమాచారం తెలిసిన వెంటనే సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత ఖర్చులతో చిన్నారి అంతక్రియల కోసం ఆ కుటుంబానికి రూ.5,000 తక్షణ సాయం అందించి పెద్ద దిక్కుగా నిలిచారు.
BDK: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లాలని MLA కూనంనేని సాంబశివరావు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం తీర్మానం చేసినా, తుది నిర్ణయం కేంద్ర పరిధిలోనే ఉందని గుర్తుచేశారు.
MNCL: చెన్నూర్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రవీందర్, ఉపాధ్యాక్షుడిగా రమేష్, ప్రధాన కార్యదర్శిగా మహేష్, జాయింట్ సెక్రటరీగా వికాస్ కచ్‌వా , కోశాధికారిగా రాజేష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
WNP: కాంగ్రెస్ మైనార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు. శనివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ.. అక్షర స్కూల్ యాజమాన్యాన్ని తాము డబ్బులు అడిగినట్లు నిరూపిస్తే రాజీవ్ చౌరస్తాలో బహిరంగ ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలని అన్నారు.
RR: యాచారం మండలంలోని అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదని మాల్ గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యుడు ప్లకార్డులతో నిరసనకు దిగారు. తన వార్డులో జరుగుతున్న పనులకు సంబంధించి కనీసం కొబ్బరికాయ కొట్టేందుకు కూడా పిలవడం లేదని ఆయన ఆరోపించారు. సమాచారం దాచడం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిపై పంచాయతీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
HYD: మైనింగ్‌పై అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేయాలని మల్కాజ్‌గిరి నియోజకవర్గం BRS పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. BRS ఎమ్మెల్యేలు అందరు కలిసి అసెంబ్లీ స్పీకర్ చైర్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
PDPL: R&B ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్ శ్రీహర్ష శనివారం సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. పెద్దపల్లి- కాటారం రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులు, లింగాపూర్ రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మానేరు నదిపై నిర్మించే బ్రిడ్జి టెండర్, మంథని గెస్ట్ హౌస్ నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
WGL: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల డిప్యూటేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని అధికారులను దివ్యాంగుల నాయకుడు సురేష్ కోరారు. ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి బదిలీ కావడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి దివ్యాంగులకు బాసటగా నిలవాలని కోరారు.
SRCL: కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించి, సంస్థ అభివృద్ధికి సహకరించాలని సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఛైర్మన్ చిక్కాల రామారావు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలోనూ, అభివృద్ధిలో సహకార రంగానికి స్ఫూర్తిగా సెస్ నిలిచిందన్నారు. ఈ మేరకు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 4 సభను విజయవంతం చేయగలరని కోరారు.
KMM: ఆన్ లైన్‌లో ట్రేడింగ్ అని నమ్మించి సుమారు రూ. 2 కోట్ల రూపాయలు మోసం చేసిన విషయం తేలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు నిందుతులను ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను నిందితులను కోర్టుకు తరలించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
HNK: కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌ను నవతెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ వినతి పత్రం అందజేశారు. హనుమకొండ జిల్లాలో దివ్యాంగులకు కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుని దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి. అజీమ్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ఆపద సమయాల్లో ధైర్యంగా తలపడేలా, వారి రక్షణకు వారే పూనుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ మేరకు శిక్షణ పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఏప్రిల్ 2న నిర్వహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు శనివారం DSP వహీదుద్దీన్‌ను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమ వివరాలను వివరించి పోలీసుల సహకారం కోరారు. అనంతరం CI ప్రేమ్ కుమార్‌కు భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై వినతిపత్రం సమర్పించారు. సీఐని కలిసిన వారిలో మంచ్ సభ్యులు ఉన్నారు.
SRD: భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంది మండలం జిలకర గ్రామంలో శనివారం జరిగింది. గత జనవరిలో భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీన్ని తట్టుకోలేని భార్య మమత (28) ఇద్దరు పిల్లలు మణికంఠ (7), ప్రళయ (5) లకు విషం ఇచ్చింది. అనంతరం మమత ఉరి వేసుకొని మరణించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.