HYD: బోయినపల్లి మార్కెట్ యార్డును డంప్ యార్డు చేశారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. గత 9 నెలలుగా చెత్తను తీసుకువెళ్లే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు రాకపోవడం వల్ల వందల లారీల చెత్త పేరుకుపోయిందన్నారు. అసలు యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకుంటే భారీ పోరాటం చేస్తామన్నారు.
MDK: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘Arrive Alive’ కార్యక్రమాన్ని మెదక్‌లో నిర్వహించారు. రహదారి వినియోగదారుల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో, బస్సు, లారీ డ్రైవర్లు, పోలీస్ సిబ్బందికి కంటి పరీక్ష నిర్వహించారు.
KNR: కరీంనగర్ సుభాష్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నీలి మల్లేశం శనివారం గుండెపోటుతో మరణించారు. మృతుడిపై భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన తల్లి ఆధారపడి ఉన్నారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మధ్యల రాజేందర్, నెల్లి పెద్దలు, బొగ్గుల మల్లేశం, మేకల మల్లేశంలు కోరారు.
GDWL: రాజోలి మండలంలో మహిళలను అక్షరాస్యులుగా మార్చే ‘ఉల్లాస్’ పథకం ముగింపు పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మొత్తం 1,598 మంది మహిళలు పరీక్ష రాయనుండగా, ఇందుకోసం 11 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో అబ్దుల్ సాయీద్ ఖాన్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు VOAల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని, అధికారులు కేంద్రాలను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.
MDCL: అల్వాల్ పట్టణంలో టెంపుల్ అల్వాల్లో గల హరిదాసు మండపంలో 75వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి అభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకంను బ్రహ్మశ్రీ మిరియంపల్లి వరుణ్ కుమార్ శర్మ గావించారు. సత్యనారాయణ స్వామి వ్రతం, సాయంత్రం అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ సంకీర్తన సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
SRCL: వచ్చే ఏప్రిల్ 7న వేములవాడ పరిధి తిప్పాపూర్‌లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ తిప్పాపూర్ గోశాలలోని మధ్యస్థం నుంచి పెద్దగా ఉన్న 300 కోడెలు మంగళవారం ఉదయం 07.00 గంటలకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ASF: ఆసిఫాబాద్ జిల్లాలో సర్వర్ల నిర్వహణ పనుల కారణంగా ‘మీ-సేవ’ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 8 నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుందని అధికారులు శనివారం ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మెరుగుదలకై ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, ఇతర సేవలను ఈ గడువు కంటే ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు.
SRPT: హుజూర్‌నగర్ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ కీలక సూచనలు చేశారు. కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించడమే లోక్ అదాలత్‌ల ప్రధాన లక్ష్యమన్నారు. తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవలాన్నారు.
JGL: ముస్లీం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుజాత, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, డాక్టర్ విజయ్ రెడ్డి పాల్గొన్నారు.
KMR: జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వారాంతపు, రోజువారీ సంతల వేలం పాటను శనివారం నిర్వహించారు. సర్పంచ్ సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ వేలం ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ప్రతి గురువారం జరిగే వారాంతపు సంతను జావిద్ బాగ్ వాన్ అత్యధికంగా రూ. 3,25,000 చెల్లించి వేలంలో దక్కించుకున్నారు.
MBNR: వేసవి తాపం కారణంగా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్సై శేఖర్ రెడ్డి సూచించారు. పాఠశాలలు త్వరగా ముగియడంతో పిల్లలను నిర్లక్ష్యంగా బయటకు పంపకూడదన్నారు. బావులు, చెరువులు, కుంటల వద్ద పర్యవేక్షణ లేకుండా వెళ్లనివ్వవద్దని హెచ్చరించారు. వేసవిలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
NRML: పిల్లల వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్‌పై జరిగిన దాడిని ఐఎంఏ, స్థానిక వైద్యులు తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం 24 గంటలు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు అమానవీయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ఓపీ సేవలను గంటపాటు నిలిపివేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని శనివారం డిమాండ్ చేశారు.
NZB: ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని, నిజామాబాద్ నగర అభివృద్ధే ధ్యేయంగా అందరం పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
NRPT: నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో తై బజార్, జంతు వధశాల, పశువుల సంత, మాంస వ్యర్థాల సేకరణకు వేలంపాట నిర్వహించనున్నట్లు కమిషనర్ నర్సయ్య తెలిపారు. పాల్గొనే వారు తై బజార్‌కు రూ.లక్ష, వధశాలకు రూ.50 వేలు, వ్యర్థాల సేకరణకు రూ.లక్ష, పశువుల సంతకు రూ.లక్ష డీడీలు కట్టాలన్నారు. అలాగే రశీదులని ఈనెల 30న మధ్యాహ్నం 12లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
NLG: నాంపల్లి మండలంలోని ఎస్‌డబ్ల్యూ లింగోటం పంప్ హౌస్‌లో 440 స్థాయి పంపుల బేరింగ్‌లు విరిగిపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు రాబోయే 3 రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని అధికారులు వెల్లడించారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచించారు.