MDCL: యాసంగి రైతు భరోసా పథకం 2025-26 కింద అర్హులైన రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 2026 ఫిబ్రవరి 28 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే అర్హులైన అందరికీ రైతుబంధు నిధులు జమ అవుతాయని కీసర మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవిలత వెల్లడించారు.
వనపర్తి మండలం రాజనగరంలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం తాత మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నక్క రాకేష్ (20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాతపై ఉన్న మమకారంతో యువకుడు తనువు చాలించడం గ్రామంలో విషాదం నింపింది.
BDK: శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో త్రివేణి – కృష్ణవేణి విద్యాసంస్థలు గత 12 ఏళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల దాహార్తిని తీర్చేందుకు సుమారు 50 వేల మజ్జిగ ప్యాకెట్లు, 50 వేల మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.
VKB: పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాహనదారుల ఇబ్బందులకు తెరపడింది. రోడ్డుకు ఇరువైపులా, డివైడర్ల మధ్య అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు. ఈ మొక్కల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
PDPL: శ్రీరాంపూర్ మండలం గంగారం కూరగాయల వారసంతకు ఈనెల 30న ఉదయం 10:30 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి షాహాబుద్దీన్ తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొనేవారు రూ. 100 డిపాజిట్ చెల్లించాలన్నారు. పాటలో నెగ్గిన వారు అదే రోజు సగం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు పాల్గొనాలని సూచించారు.
KMM: నేలకొండపల్లి వద్ద జాతీయ రహదారిపై ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్థులు శుక్రవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
SRPT: నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం (నేడు) ఉపాధి హామీ పనుల (2024-25)పై సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎల్.మన్సూర్ నాయక్ తెలిపారు. జిల్లా అధికారులు పాల్గొనే ఈ బహిరంగ విచారణకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది అందరూ సకాలంలో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
NRML: జిల్లా కేంద్రంలోని ఓ వైద్యుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఇవాల నిర్మల్ బంద్‌కు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. హిందువులపై దాడులను నిరసిస్తూ ప్రతి ఒక్కరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇకపై హిందువులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.
HYD నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. సౌత్ సెంట్రల్ రైల్వే రూ.430 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో రాయగిరి వరకు 33 కిమీ లైన్ నిర్మాణం జరగనుంది.
SRD: సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం గురుస్వామి తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, గణపతి హోమం, అష్ట దివ్య కలశాభిషేకం, రాత్రి 7 గంటలకు మహా పడిపూజ నిర్వహిస్తామని చెప్పారు.
WGL: వరంగల్ నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వేదికగా శుక్రవారం నిర్వహించిన IAIC 2026 సదస్సు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య వారధిని నిర్మించడంలో కీలక మైలురాయిగా నిలిచింది. పరిశ్రమలు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ట్రాన్స్లేషనల్ రీసెర్చ్‌ను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
SDPT: సిద్దిపేటలోని ఓ స్కూల్లో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత వివరించారు. సిగ్నల్స్, రోడ్డు గుర్తులు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.
MHBD: నెల్లికుదురు మండలం కాచికల్ స్టేజీ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో 40 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. గంజాయి సేవిస్తున్న తొర్రూరుకు చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీ పట్టుబడ్డారు. గంజాయి విక్రయానికి సంబంధించి నెల్లికుదురుకు చెందిన సందీప్ పరారీలో ఉండగా, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ADB: సిరికొండ మండలం తిమ్మపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మడావి కాశిరామ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సిరికొండ నుంచి బోరిం వాడకు అతివేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
SRPT: పాలకీడు మండల పరిధిలోని జాన్ పహాడ్ గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ప్రదర్శించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ పౌరాణిక నాటకం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో, శ్రీ వెంకటేశ్వర కళా నాట్య మండలి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు.