PPDL: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి అర్హులైన మైనారిటీలు మార్చి 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నరేష్ కుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు, ముఖ్యమైన పత్రాలను సంబంధిత ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
NZB: ఆర్మూర్ మండలం గోవింద్ పేట గ్రామానికి చెందిన రోహిత్ రానాకు CMRF ద్వారా అందిన సాయం ఊరటనిచ్చింది. ఇటీవలే అనారోగ్యం బారినపడి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరిన రోహిత్ పరిస్థితిని తెలుసుకున్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రభుత్వానికి విన్నవించి ఎల్ఓసీ కాపీని మంజూరు చేయించారు.
SDPT: భద్రాచల దేవస్థానం నుంచి వచ్చిన 3 క్వింటాల వడ్లు గోటి తలంబ్రాలకు ఇవాళ అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించడానికి వడ్ల ప్యాకెట్లు సిద్ధిం చేశామన్నారు.
ADB: ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ హైదరాబాదులో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
KMR: తాడ్వాయి మండలంలోని భ్రమణపల్లికి చెందిన పలువురు కీలక నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డు సభ్యులు నవీన్ గౌడ్, నారాయణ, గైని రాజుతో పాటు బీఆర్‌ఎస్ నాయకుడు మరాఠీ శ్రీనివాస్, బీజేపీ నాయకుడు అబ్బగొని రామాగౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
ADB: అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకున్న నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని మావల CI కర్రె స్వామి శుక్రవారం తెలియజేశారు. నిందితులలో హమీద్, షరీఫ్ ను అరెస్ట్ చేయగా అంజుం, మెహరున్నీసా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేఆర్కే కాలనీకి చెందిన పట్పెల్లీ లలితకు అందజేసిన ప్రభుత్వ ఇంటి స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో నిందితులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
GDWL: మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ (RI) శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఆత్మకూరులో బంధువుల వివాహానికి హాజరై తిరిగి గద్వాలకు వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.
WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆర్తి అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజిరెడ్డి, కోశాధికారిగా భాస్కర్, ఉపాధ్యక్షుడిగా పాక భాస్కర్ మల్లేశం ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధి, వ్యాపారుల సమస్యల కోసం కృషి చేస్తామని తెలిపారు.
SRPT: జిల్లాలోని నిరుద్యోగ క్రైస్తవ మైనారిటీ యువతకు ‘కౌంటర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్’ కోర్సులో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నర్సింహులు తెలిపారు. 18-35 ఏళ్ల లోపు వయస్సు, ఇంటర్ అర్హత కలిగిన వారు ఈ నెల 26లోగా కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9492611057ను సంప్రదించాలని అన్నారు.
NLG: నారాయణపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు చెరుకుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు ఇస్లావత్ మౌనిక, జరుపుల రేణుక ఎంపికయ్యారని ఎంఈఓ గోప్యా నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించడం గర్వకారణమని ఆయన అభినందించారు. విద్యార్థినులు జిల్లాకు పేరు తేవాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.
ASF: పెంచికల్ పేట్ మండలం గుంట్లపేట గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు మాజీ MLA కోనేరు కోనప్ప శుక్రవారం హాజరయ్యారు. ఉత్సాహభరితంగా సాగిన పోటీలలో విజేతలకు, రన్నరప్ జట్లకు అయన బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో ముందుకు రావడం ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని అన్నారు.
SDPT: సిద్దిపేట మండల కేంద్రంలోని బెజ్జంకి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మాజీ MPTC కొండ్ల వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులందరికీ సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించగా, ఉపాధ్యాయులకు ECG, BP, షుగర్, కంటి పరీక్షలు చేసి తగిన సూచనలతో పాటు అవసరమైన మందులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ కొండ్ల విద్యా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
PDPL: ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు నంది మేడారం కోర్టు న్యాయవాది ఆకారి రాజేశం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చదువు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక సాధనం’ అని పేర్కొన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో రాబోయే పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వార్డు సభ్యులకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నామని స్థానిక ఎంపీడీవో సరోజ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఉన్న 160 మంది వార్డు సభ్యులలో 80 మంది చొప్పున శిక్షణ ఇస్తామన్నారు. పట్టణంలోని రైతు వేదికలలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు, మార్చి 3 నుంచి 8 వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆ శిక్షణకు వార్డు సభ్యులు రావాలని ఆమె కోరారు.
BDK: చుంచుపల్లి మండల కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. విద్యాచందన హాజరై రుణాల 100% రిపేమెంట్, PMKSY పనుల పూర్తి, యూనిఫామ్‌ల తయారీని సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతపై గ్రామస్థాయి బాధ్యత వహించాలని సూచించారు.