NGKL: LRS ప్రక్రియ మార్చి 2025 నాటికి పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, డీఎల్పిఓ, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ.. LRS ప్రక్రియపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలోని దక్షిణ భారత దేశంలో అతి పెద్ద బౌద్ధ స్థూపాన్ని మంగళవారం బౌద్ధ సాధువులు సందర్శించారు. బౌద్ధులపై దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న చర్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షు సద్ధారక్కిత, బిక్జు ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బౌద్ధ ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
WNP: కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి సమస్యను పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జబ్బార్ ఆరోపించారు. మదనాపురం మండలంలోని అజ్జకొల్లు, తిరుమలాయపల్లి గ్రామాల్లోని వరి పంటలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని సాగునీరు అందించడంలో విఫలమైందన్నారు.
KMR: బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీవారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ తిరుమల ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి కాకుండా భక్తులు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇక్కడికి తరలివస్తారని చెప్పారు.
SRD: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంగ్టి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిషన్ శక్తిలో భాగంగా బేటి బచావో బేటి పడావో అనే కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగమణి, ఏఎన్ఎంలు ఉన్నారు.
NLG: సంవత్సరమంతా కష్టపడి చదివిన విద్యార్ధులు కష్టంతో కాకుండా ఇష్టంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాసి మంచి ఫలితాలు సాధించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. బుధవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నేపధ్యంలో ఆయన విద్యార్థులకు శుభాశీస్సులు అందజేశారు.
MBNR: మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ బుధవారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అమలు తీరుపై అధికారులు బ్యాంకర్లతో సమీక్షలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు సాందీపని ఆవాసం 20వ వార్షికోత్సవాల్లో పాల్గొననున్నారు.
GDWL: చారిత్రక కట్టడాలను పునరుద్ధరించుకొని భవిష్యత్ తరాలకు గత సంస్కృతిని అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ దశరథ్ కలిసి గద్వాల మట్టి కోటను పరిశీలించారు. కోట పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయడానికి అవసరమైన మరమ్మత్తు, పరిశుభ్రత, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. వారసత్వ కట్టడాలను రక్షించాలన్నారు.
NZB: నగరంలో మంగళవారం కత్తిపోట్ల కలకలం చెలరేగింది. నగరంలోని గాజుల్ పేట్‌లో ఓ సంఘం సమావేశంలో జరిగిన పరస్పర వాదనలు కాస్తా కత్తిపోట్లకు దారితీసాయి. సంతోష్ అనే వ్యక్తిని ఒకరు కత్తితో పొడిచి గాయపరిచాడు. కత్తిపోట్లలో గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ అధికారులకు సూచించారు. చివ్వెంల మండలం చందుపట్లలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వేసవిలో నీటి ఎద్దడి నెలకొనే ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈఈ శ్రీనివాసరావు , డీపీఓ నారాయణరెడ్డి ఉన్నారు.
KMR: దోమకొండ రోడ్డుపై తిరుగుతున్న వాహనాలను మంగళవారం ఎస్సై స్రవంతి తనిఖీని చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ కార్లు నడిపిస్తున్న వారు సీట్ బెల్టు తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్ , పొల్యూషన్ పత్రాలు ఉండాలని ఆమె సూచించారు. రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించి వాహనాలు నడపాలని ఎలాంటి పత్రాలు లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు.
KMR: వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతి కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాదులో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎంపీకి వివరించారు.
NZB: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలుపొందడంతో నవీపేట్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంబురాలు జరిపారు. బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా నాయకులు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి ఆదరణ రోజురోజుకు పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాధ, భూషణ్, రాము, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
NRML: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం గోదాం వద్ద భద్రత సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. షిఫ్టుల వారీగా భద్రతను పర్యావేక్షించాలని అన్నారు. గోదాం వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు.
నిర్మల్: బీజేపీపై ప్రజలకు ఆదరణ పెరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం ఖానాపూర్ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ శ్రీనివాస్ ఉన్నారు.