ములుగు ఎమ్మెల్యే సీతక్క అర్ధరాత్రి ధర్నాకు దిగారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. బ్యాలెట్ పత్రంపై తన ఫోటో చిన్నగా ఉందని ఆమె తెలుపుతూ దానిని మార్చాలని కోరారు.
ములుగు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దనసరి అనసూయ(Seethakka) సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ధర్నా చేపట్టారు. ఈవీఎం ఎన్నికల బ్యాలెట్ పత్రంలో తన ఫోటో చిన్నగా ఉందని ఆమె ఆరోపించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే విషయాన్ని అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులతోపాటు ఎస్సై వెంకటేశ్వర్ అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. ఆ క్రమంలో వారికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి అంకిత్ సూచన మేరకు నాయకులు సీతక్క మరో ఫోటోను తీసుకుని అధికారికి ఇచ్చారు. ఆ కొత్త ఫోటోను బ్యాలెట్ పై పొందుపరుస్తామని అధికారి చెప్పి వెళ్లిపోయారు. కానీ అతను చెప్పిన హామీలో స్పష్టత లేదని కాంగ్రెస్ నేతలు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సీతక్క అర్ధరాత్రి తర్వాత రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విజయ్ భాస్కర్ తో మాట్లాడి అక్కడే బైఠాయించారు. మరోవైపు ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఆమెకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా సీతక్క నిరసన కొనసాగించారు. అయితే ఒక ఎమ్మెల్యే అర్ధరాత్రి ధర్నా చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అధికారుల(officers)పై చర్యలు తీసుకోవాలని..తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.