కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ లో పోలీసులు దాడులు చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడమే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై రైడ్ చేసి..అందులోని సిబ్బందిని ఎత్తుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్ రూమ్ లోని 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని చెప్పారు.
రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనపై మాట్లాడేందుకు రాత్రి రెండు గంటల వరకు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన ఎవరూ స్పందించలేదని అన్నారు. ఫోన్లకు అందకుండా తిరుగుతున్నారంటే.. వీళ్లు పోలీసులా? దొంగలా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ తో సహా పలువురు నేతలు ప్రశ్నిస్తే ..సునీల్ కనుగోలును అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పారు. వార్ రూమ్ సిబ్బందిని దౌర్జన్యంగా రౌడీ మూకల మాదిరిగా పోలీస్ వాహనాల్లో తీసుకెళ్లారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని ఎక్కడ దాచారో తెలియడం లేదన్నారు. డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్లు చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు.
ఫిర్యాదుకు సంబంధించిన ఎఫైర్ వారెంట్ ఏమీ చూపించకుండా సునీల్ కనుగోలును అరెస్ట్ చేసేందుకు వచ్చామని సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సేకరించిన తమ డేటాను పోలీసులు ఎత్తుకుపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ అల్లరి మూకల మాదిరిగా, కిరాయి గూండాల్లాగా పోలీసులు దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేసీఆర్ ఓడిపోతారనే భయంతో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ పై దాడులు చేశారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలంగాణ భవన్ నుంచి బయలు దేరుతున్నట్టుగా చెప్పారు. చట్టాన్ని పాటించకుండా తెలంగాణ వార్ రూమ్‌పై దాడి ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లో పోలీసు కమిషనరేట్‌ను అక్కడ తమ పార్టీ నాయకులు ముట్టడిస్తారని చెప్పారు.