నిరుద్యోగ నిర్మూలనే తమ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన యువతీ, యువకులెవరు నిరుద్యోగులుగా ఉండొద్దని శిక్షణ తీసుకొని అవకాశం ఉన్న రంగంలో ఉపాధి పొందాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసమే వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో తెలంగాణ యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..శంషాబాద్ మున్సిపాలిటీ మండలంలో అధిక సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారని వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం తరఫున శిక్షణ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవించడంతో వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ శంషాబాద్‌లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించారని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. ఈ ఏరియాలో మళ్ళీ నిరుద్యోగులున్నారనే వార్త వినపడకూడదన్నారు.
ఇందులో 22 రకాల శిక్షణలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ శంషాబాద్ చుట్టు పక్కల అనేక కంపెనీలు వస్తుండటంతో ఇక్కడి ప్రజలు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉండాలని తెలిపారు.