KCRపై ఢిల్లీ పెద్దల కుట్రలు.. కేటీఆర్ హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్పై ఢిల్లీ పెద్దలు కుట్ర పన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజకీయాల్లోకి రాకుండా మోడీ, రాహుల్ గాంధీ కలిసి అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
Minister KTR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఢిల్లీ పెద్దలు కుట్ర పన్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయడానికి మరిన్ని రిపోర్టులు తయారు చేస్తారని తెలిపారు. ఇక్కడ ఏదీ బాలేదని చెప్పడానికి బీజేపీ, కాంగ్రెస్ ఆఫీసుల్లో తయారు చేసిన నివేదికలతో ప్రజలను అయోమయం చేయడానికి ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తారని మండిపడ్డారు. దీనికి గల కారణం కేసీఆర్ను తెలంగాణలో కొడితే.. మహారాష్ట్రలో రాడని వారి వ్యుహాం అని వివరించారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) సమక్షంలో పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు మిగిలి ఉన్న ఒక్క గొంతుక కేసీఆర్ అని.. ఆయనను ఇక్కడ క్లోజ్ చేయాలని భావిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలా జరిగితే మహారాష్ట్ర రాడని.. దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టకుండా చేయడమే కాంగ్రెస్, బీజేపీ లక్ష్యం అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో కులం పేరుతో కేసీఆర్ కుంపట్లు పెట్టలేదని.. మతం పేరు మీద మంటలు, ప్రాంతం పేరుతో పంచాయితీలు పెట్టలేదన్నారు. అభివృద్ధి తన కులం, సంక్షేమమే తన మతం, జనహితమే అభిమతమని పనిచేశారని వివరించారు. ప్రజల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని గుర్తుచేశారు. వెలుగులు నింపిన కేసీఆర్ కావాలో.. కరెంట్లు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ కావాలో ఆలోచించాలని కోరారు.
మునుగోడులో ఎందుకు ఉప ఎన్నికలు వచ్చాయో.. రాజగోపాల్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారో.. ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చారో ఆయనకే తెలియాలన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. బై పోల్లో స్రవంతి పేరు చెబితే ఆమాత్రం ఓట్లు వచ్చాయని తెలిపారు. డబ్బు మదంతో రాజకీయాలు చేస్తోన్న రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ది చెప్పాలని కోరారు. అతని అహంకారాన్ని, ధనమదాన్ని వంచాల్సిన అవసరం ఉందన్నారు.