ప్రధాని మోదీ(PMModi)పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అక్టోబర్1న ప్రధాని వస్తున్నాడని, కానీ ఆయన ఓట్ల వేట కోసం బయలుదేరిన మాయగాడని కేటీఆర్ (KTR) అన్నారు. పాలమూరు ప్రజలకు చెప్పు మాపై నీకెందుకింత పగ అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక(Karnataka)లో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చావని, కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కష్టపడి సాధించిన తెలంగాణ(Telangana)ను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కోసం ఒక్క సంతకం పెట్టేందుకు మీకు చెయ్యి రావడం లేదన్నారు. 575 టీఎంసీల నీళ్లు పాలమూరుకు ఇస్తున్నానని చెప్పి బూత్ పూర్ గడ్డపై మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.మనం ఎన్ని దరఖాస్తులు పంపినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని, వాల్మీకి (Valmiki) బోయలకు ఎస్టీ రిజర్వేషన్ అడిగితే పట్టించుకోలేదన్నారు. తెలంగాణ సత్తా చాటుదామని, సీఎం కేసీఆర్ (CMKCR) నాయకత్వంలో తెలంగాణకు అడ్డువచ్చే కేంద్రంలోని రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ల మెడలు వంచి మన జగన్నాథ రథ చక్రాల కింద తొక్కుకుంటూ ముందుకు వెళ్దామన్నారు.