తెలంగాణలో అక్టోబర్ 1వ తేది వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడమే కాకుండా దానికి తోడుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్టోబర్ ఒకటో తేదీ వరకు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆదిలాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేటతో పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని టీఎస్డీపీఎస్ వెల్లడించింది. హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరించింది.