సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. నవంబర్ 20 వరకు కవితకు సమన్లు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 20కి వాయిదా వేసింది. కాగా, లిక్కర్ స్కాం(Liquor scam)లో ఈడీ తనపై అసత్య ప్రచారం చేస్తోందని కవిత.. అత్యున్నత న్యాయస్థానంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. మహిళ అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం పెర్కోన్నాది. అయితే.. మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు తాత్కాలిక ఊరట ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమెకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో.. ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారామె. లిక్కర్ కేసులో గతంలోనూ ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ కార్యాలయంలో విచారణకు హారజయ్యారు. అయితే.. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం (Nalini Chidambaram) తరహాలో ఇంటివద్దే తనను విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు.