నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం (CM KCR) అన్నారు.చాకలి ఐలమ్మ (Chityala Ilamma) జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా వారి త్యాగాలను పోరాట స్ఫూర్తిని సీఎం స్మరించుకున్నారు. నాటి కాలంలోనే, తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామికవాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని సీఎం కొనియాడారు.
నాటి వారి స్ఫూర్తి తెలంగాణ (Telangana) సాధనలోనూ, అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. దేశంలో మరెక్కడాలేని విధంగా రజకుల (Rajakula) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మహిళలు, బీసీ, ఎంబీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు.సబ్బండ కులాల జీవన ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మకంగా అభివృద్ధి పరుస్తున్నదని, బీసీ, ఎంబీసీ (MBC) మహిళల సంక్షేమం కోసం తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి (Vettichakiri) నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని సీఎం అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని చెప్పుకొచ్చారు. హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం, రాష్ట్ర ప్రభుత్వం (State Govt) కృషి సాగిస్తున్నదని వివరించారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.