హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామన్నారు.
KTR: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామన్నారు. పట్టుదలతో సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని కేటీఆర్ అన్నారు. మహనీయుడు అంబేడ్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితో కేసీఆర్ లక్షలాది మందిని సమీకరించి 14 ఏళ్లు తెలంగాణ పోరాటాన్ని నడిపించారన్నారు. రాష్ట్రంలో 1,022 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి నుంచి బయటకు వచ్చిన లక్షల మంది ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని తెలిపారు.
హైదరాబాద్లో 125 అడుగుల బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అది విగ్రహం కాదు.. విప్లవం అనే మాట కేసీఆర్ అన్నారు. సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టాం. మహాత్మా గాంధీతో పోల్చే గొప్ప నాయకుడు అంబేడ్కర్ అని కేటీఆర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా.. అవన్నీ ఆయన ఆలోచన నుంచి వచ్చినవే. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు.