గవర్నర్ తమిళిసై మరోసారి సీఎం కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. చాలా సార్లు సీఎం కేసీఆర్ చేసిన పనులు తనను బాధించాయని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
స్వాతంత్య్ర దినోత్సవం (Independence day) వేళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Thamilisai) సీఎం కేసీఆర్(Cm Kcr)పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పుదుచ్చేరికి ప్రస్తుతం ఆమె లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేడు అక్కడి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తమిళనాడు గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం స్టాలిన్ గైర్హాజరవడం మంచి విషయం కాదన్నారు. తాను గవర్నర్‌గా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అలాగే చేశారన్నారు. ఆ ఘటన తనను చాలా బాధించిందన్నారు. రాష్ట్ర గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, అప్పుడే పరిపాలన అద్భుతంగా ఉంటుందన్నారు.
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ప్రోటోకాల్ విషయంలో కేసీఆర్ (KCR) సర్కార్ పై గవర్నర్ తమిళిసై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ మధ్యనే పెండింగ్ బిల్లుల విషయంలో కూడా గవర్నర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు విమర్శలు గుప్తిస్తూ వస్తున్నారు. రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య చాలా గ్యాప్ రావడంతో చర్చంతా వాటిపైనే సాగుతోంది.
గవర్నర్ హాజరయ్యే అధికారిక కార్యక్రమాలకు సైతం సీఎం కేసీఆర్ గైర్హాజరవుతూనే వస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ విషయంపై బీఆర్ఎస్ మంత్రులకు, గవర్నర్‌కు మధ్య మాటల యుద్ధమే సాగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మ తెలంగాణలో పర్యటించారు. ఆ సమయంలో కేసీఆర్, గవర్నర్ ఇద్దరూ ఒకే వేదికలపైకి వచ్చి పలకరించుకున్నారు. అయితే సమస్య అంతటితో ఆగిపోయిందనుకునే తరుణంలో మరోసారి గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. గవర్నర్ కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.