KCR : మూడు జిల్లాల పర్యటనలో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెంట్ పోయిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 24గంటలు రెప్పపాటు కరెంటు పోకుండా విద్యుత్ సరఫరా అందించామన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. షార్టెజ్ ఉంటే కరెంటు కొనుగోలు చేసి ఇవ్వాలని సూచించారు. అంతే ఖర్చువుతుందని లెక్కలు చూడొద్దన్నారు. కరెంటు వచ్చిపోతుంది కాబట్టే బావి మోటర్లు కాలిపోతున్నాయ్. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు… మేం మాత్రం ఊరుకోమన్నారు కేసీఆర్. సాగు, తాగు నీరు ఇవ్వడంలో ఘోరంగా విఫలం అయ్యారు. గతేడాది ఈ టైంకు సింగూరులో 70టీఎంసీల నీళ్లు ఉండేవి. నీళ్లు ఎత్తిపోయడానికి ఈ ప్రభుత్వానికి ఏమైంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా అని ప్రశ్నించారు. ఇంజినీర్ల తప్పుల వల్లో, ఇసుక కొట్టిపోతనో, నీళ్లు ఎక్కువ వస్తేనో ఏదో ఒక కారణంతో కొట్టుకోతే ప్రపంచం బద్దలు అయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పారిశ్రామికంగా పెంచాం, ఐటీ పరంగా అభివృద్ధి చేశాం. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. మీ అసమర్థత వల్ల 15లక్షల ఎకరాలు పంట ఎండిపోయింది. నీళ్లిస్తామని చెప్పి మధ్యలో నీళ్లు ఇవ్వకుండా రైతులను ఆగం చేశారు. రైతురుణ మాఫీ చేస్తాం, డిసెంబర్ 9న మాఫీ చేస్తాం వెళ్లి లోన్ తెచ్చుకోమన్నారు. డిసెంబర్ 9వ తారీఖు ఎప్పుడు పోయింది. రుణమాఫీ చేస్తామన్న రేవంత్ ఎక్కడికి పోయాడన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ నాయకులను నిద్ర కూడా పోనియ్యమన్నారు. రైతుల దగ్గరకు వెళ్లి బ్యాంకర్లు గోస పెడుతున్నారు. రేవంత్ సంగతి మాకు తెలియదని బ్యాంకోళ్లు చెబుతున్నారు. నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ వివరించారు.