RIMS Medical College : రిమ్స్ మెడికల్ కాలేజీ ఎదుట మరో మారు ధర్నాకు దిగిన మెడికోలు
ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)లో మెడికోలు మరోసారి ఆందోళనకు దిగారు. రెండో రోజు రిమ్స్ వైద్య కళాశాల ఎదుట జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగనుంది.
RIMS Medical College : ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)లో మెడికోలు మరోసారి ఆందోళనకు దిగారు. రెండో రోజు రిమ్స్ వైద్య కళాశాల ఎదుట జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగనుంది. రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్‌ను బర్తరఫ్ చేసి విచారణ జరిపించాలని మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. రెండో రోజు డ్యూటీకి దూరంగా వైద్య విద్యార్థులు ఉన్నారు. కళాశాల ఎదుట మరోసారి జూనియర్ డాక్టర్లు దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో రిమ్స్ మెడికోల ఆందోళన ఉధృతం అవుతోంది.
రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. డైరెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. అత్యవసర విభాగం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు రిమ్స్ ప్రధాన గేటు దగ్గర రోడ్డు ఎక్కి నిరసన తెలిపారు. డైరెక్టర్ రాథోడ్ జైసింగ్‌ను తొలగించే వరకు ఆందోళన ఆగదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. కాగా, బుధవారం రాత్రి వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడి చేశారు. ఆరుగురు హౌస్ సర్జన్లపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.