BMS Ultimatum: ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఆటోలు పెట్టుకోండి
ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఆటోలు పెట్టుకోవాలని.. లేదంటే బస్సుల సంఖ్య తగ్గించాలని రేవంత్ సర్కార్‌ను బీఎంఎస్ డిమాండ్ చేసింది. లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించింది.
BMS Ultimatum: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు (women) ఉచిత ఆర్టీసీ బస్సు (bus) ప్రయాణం పథకం ఇటీవల ప్రారంభమైంది. ఆ స్కీమ్‌కు అతివల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఆటోలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఇతర ముఖ్య నగరాల్లో ఆటోవాలాల ఇబ్బందులు మాములుగా లేవు. సో.. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల తమకు నష్టం కలుగుతోందని భారతీయ మజ్దూర్ సంఘ్ నేతలు అంటున్నారు. ఇదివరకు 70 శాతం మహిళలు ఆటోలు ఎక్కేవారని చెబుతున్నారు. దాంతో రోజుకు కనీసం రూ. వెయ్యి సంపాదించే వారమని తెలిపారు. ఇప్పుడు రూ.300 కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఉచిత పథకాలతో తమ పొట్ట కొట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఆటోలను పెట్టుకోవాలని కోరారు. లేదంటే బస్సుల సంఖ్య తగ్గించాలని అల్టిమేటం జారీచేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఓల, ఉబర్ క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే.. రేవంత్ సర్కార్ ఉచిత ప్రయాణంతో తమ కడుపు కొడుతుందని ధ్వజమెత్తారు. తమ సమస్యను పరిష్కరించాలని లేదంటే.. 18వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టంచేశారు.
18వ తేదీన ధర్నా చేపడుతామని.. 19వ తేదీన కలెక్టర్లకు వినతి పత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు. 20వ తేదీన డిపోల వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. 21, 22 తేదీల్లో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆటో సంఘాలతో చర్చలు జరుపుతామని.. న్యాయం చేయకుంటే ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజా భవన్ ముట్టడిస్తామని స్పష్టంచేశారు.