»Disappearance Of Important Content On Government Websites Ktrs Complaint To Cs
KTR: ప్రభుత్వ సైట్లలో ముఖ్యమైన సమాచారం మిస్.. సీఎస్‌కు ఫిర్యాదు చేసిన కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా పేజీలలో ముఖ్యమైన సమాచారం కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.
KTR: తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా పేజీలలో ముఖ్యమైన సమాచారం కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. తన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ట్యాగ్ చేశారు. దీనిపై తక్షణమే స్పందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత సోషల్ మీడియా హ్యండిల్స్లో, ప్రభుత్వ వెబ్సైట్లలో చాలా ముఖ్యమైన సమాచారం కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
అలాగే కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లు కూడా తొలగించినట్లు కేటీఆర్ రాసుకొచ్చారు. కొత్త ప్రభుత్వం మెయింటెనెన్స్ చేయడానికి కొంత టైమ్ కావాలని వీటిని తొలగించినట్లు చెబుతున్నా.. కావాలనే ఆ సైట్లను, కంటెంట్‌ను తొలగించినట్లు కేటీఆర్ ఆరోపించారు. ఈ వైబ్ సైట్లనుంచి ముఖ్యమైన సమాచారం, వెబ్సైట్లు మాయం కావడం వెనుక పాలకుల హస్తం ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా 2014 జూన్ నుంచి 2023 కేసీఆర్ పరిపాలన సాగించినంత వరకు, రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన అనేక మంచి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కావాలనే తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.
రేపటి తరానికి ఈ ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉండాలని, ఇలాంటి వాటిని ప్రభుత్వాలు భద్రపరచాలని కానీ, ఇలా తొలగించడం సరైన పద్దతి కాదన్నారు. అదంత ప్రజల ఆస్తీ అని, వెంటనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కేటీఆర్ విన్నవించారు. త్వరగానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.