Ponguleti: ఇంటిపై ఐటీ రైడ్స్.. ముందే చెప్పిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తనపై, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతాయని రెండు రోజుల క్రితం పొంగులేటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. తెల్లవారు జామున 3 గంటలకు 8 వాహనాల్లో ఖమ్మంలో గల పొంగులేటి నివాసానికి అధికారులు చేరుకున్నారు. వెంటనే సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని.. రైడ్స్ చేసుకున్నారు. కాంగ్రెస్ పాలేరు అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఈ రోజు నామినేషన్ వేయనున్నారు.
తనపై, తన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతాయని మంగళవారం రోజే పొంగులేటి కామెంట్స్ చేశారు. ఆయన చెప్పినట్టే దాడులు జరిగాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తే మాత్రం కోర్టును ఆశ్రయిస్తానని ఆ రోజే స్పష్టంచేశారు.తాను ఒక్కడినే కాదని.. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీలో ముఖ్య నేతలను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదన్నారు.
ప్రజాస్వామ్యం అనే ముసుగులో బీఆర్ఎస్ అరాచకాలు చేస్తుందని ఆ రోజే మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనని చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టంచేశారు. 10 సీట్లు కాంగ్రెస్, సీపీఐ కూటమి గెలుచుకోబోతుందని తెలిపారు. 78 సీట్లతో డిసంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని వివరించారు. తమ 6 గ్యారెంటీలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ రోజు తెలిపారు.