Hyderabad: మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు
సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. చీరలో చూడాలని ఉందని, ఫోటోలు పంపించమని ఆ మహిళను వేధించసాగాడు. విసుగు చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
నిర్భయ చట్టం వచ్చినా కూడా మహిళలకు వేధింపులు (Harrasment) ఆగడం లేదు. అనేక రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నా వారికి ఎక్కడో ఒక చోట వేధింపులు అనేవి ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ సీఐడీ అధికారి బాగోతం బయటపడింది. హైదరాబాద్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళను సాక్షాత్తూ సీఐడీ ఎస్పీ (CID SP) వేధింపులకు గురిచేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ (Kishan Singh)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత కొన్ని రోజులుగా సీఐడీ ఎస్పీ (CID SP) కిషన్ సింగ్ విద్యుత్ శాఖ ఉద్యోగినిని వేధిస్తున్నాడు. ఆమె ఫోన్‌కు తరచూ అసభ్యకర సందేశాలను పంపుతూ ఇబ్బంది పెడుతున్నాడు. జాతీయ క్రీడా పోటీలకు (National sports Events) సదరు మహిళా ఉద్యోగి సరూర్ నగర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా కిషన్ సింగ్ (Kishan singh)తో పరిచయం ఏర్పడింది.
తన ప్రిపరేషన్‌కు సంబంధించి కొన్ని మెలకువలు నేర్పుతానని కిషన్ సింగ్ ఆమె మొబైల్ నంబర్ (Mobile Number) తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు మెస్సేజులు పంపుతూ ఉండేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అభ్యంతరకర సందేశాలను పంపడం మొదలు పెట్టాడు. మహిళా ఉద్యోగిని శారీలో చూడాలని ఉందని, ఫోటోలు పంపించమంటూ మెస్సేజులు చేస్తుండేవాడు. అంతేకాకుండా కొన్ని అసభ్యకరమైన వీడియోలు (Videos), ఫోటోలను (Photos) కూడా ఆమెకు పంపుతుండేవాడు. ఈ క్రమంలో విసుగుచెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కిషన్ సింగ్‌ను విచారిస్తున్నారు.