»An 82 Year Old Man Has Been Sentenced To 383 Years In Prison What Is The Crime Committed
Forgery Case: 82 ఏళ్ల వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్ష..చేసిన నేరం ఏంటంటే
నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో 82 ఏళ్ల వ్యక్తికి కోర్టు 383 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించింది. కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
నకిలీ పత్రాలను సృష్టించి, మోసం చేసిన కేసులో 83 ఏళ్ల పెద్దాయనకు 383 ఏళ్లపాటు జైలు శిక్ష పడింది. తమిళనాడులోని కోయంబత్తూర్ కోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది. మోసానికి పాల్పడిన వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూకోర్టు తీర్పినిచ్చింది. దాంతో పాటుగా రూ.3.32 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పును ప్రకటించింది. కేసు వివరాల మేరకు.. 1988లో తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్ లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయి.
1988 నవంబర్ 9న బస్సుల వేలంలో అక్రమాలపై ఫిర్యాదు నమోదైంది. నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ. 28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామి, రంగనాథన్, రాజేంద్రన్ లను ఆ కేసులో భాగంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది. అయితే ఈ మధ్యనే నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్ మరణించారు.
ఈ కేసుకు సంబంధించి బతికున్న వారిలో కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురినీ జడ్జి నిర్దోషులుగా తేల్చారు. ఆర్టీసీ సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆ మూడు శిక్షలను కలిపితే మొత్తం 383 సంవత్సరాల శిక్షను ఆ వ్యక్తికి విధించారు. అయితే ప్రస్తుతం కోదండపాణి వయసు 82 సంవత్సరాలు కావడంతో ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పునిచ్చారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కోదండపాణిని పోలీసులు జైలుకు తరలించినట్లు తెలిపారు.