»Holidays For Schools In Telangana September 15th 2023 Ts Tet Exam Centers Only
Holiday: తెలంగాణలో స్కూళ్లకు సెలవు..కానీ
రాష్ట్రవ్యాప్తంగా రేపు (సెప్టెంబరు 15న) టీఎస్ టెట్(TS TET 2023) జరగనున్న నేపథ్యంలో ఆయా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆ పరీక్షా కేంద్రాల్లోని పాఠశాలలు సెప్టెంబర్ 14న హాఫ్ డే మాత్రమే ఉంటాయని వెల్లడించింది.
తెలంగాణ(Telangana) ప్రభుత్వం సెప్టెంబర్ 15, 2023న పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అన్ని స్కూళ్లకు కాదు. సెప్టెంబర్ 15న షెడ్యూల్ చేయబడిన TS TET పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించబడిన విద్యాసంస్థలకు మాత్రమే హాలిడే అని తెలిపింది. దీంతోపాటు ఆయా పాఠశాలలకు సెప్టెంబర్ 14, 2023న స్కూల్ హాఫ్ డే ఉంటుందని తెలిపింది. అయితే కాలేజీలు కూడా బంద్ అనే దాంట్లో నిజం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
మరోవైపు ఇప్పటికే టీఎస్ టెట్(TS TET 2023) పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా జారీ చేసిన నిబంధనలు పాటించాలని తెలిపింది. టీఎస్ టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలని అధికారులు కోరారు. పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, లింగం, వైకల్యం మొదలైన వాటిలో అక్షర దోషాలు ఉంటే పరీక్ష హాలులో ఫోటో గుర్తింపుతో పాటు నామమాత్రపు పేపర్లో వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న ఫొటో, సంతకం సరిగ్గా లేకుంటే, అభ్యర్థులు ఇటీవల ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేసి, ఆధార్ కార్డు, ఇతర ఐడీతో రావాలని సూచించారు.
TS TET పేపర్-1 పరీక్ష(exam)ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు 1న విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ కు 2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.