»Mamata Banerjee An Open Letter From Bjp Leaders To Cm Mamata
Mamata Banerjee: సీఎం మమతకు బీజేపీ నేతల బహిరంగ లేఖ
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రోజున చాలా రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రం ఆ రోజున సెలవు ప్రకటించలేదు. జనవరి 22న సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఆ రాష్ట్ర బీజేపీ నేతలు సీఎం మమతకు ఓ బహిరంగ లేఖ రాశారు.
Mamata Banerjee: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మరో మూడు రోజుల్లో జరగనుంది. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ విశేష ఘట్టాన్ని తిలకించేందుకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రం ఆ రోజున సెలవు ప్రకటించలేదు. ఈ విషయమై ఆ రాష్ట్ర బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. జనవరి 22న సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం మమతకు ఓ బహిరంగ లేఖ రాశారు.
బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు శకుంతా మజుందార్ సీఎం మమతకు రాసిన లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. గతంలో అనేక ప్రత్యేక సందర్బాల్లో మమత బెనర్జీ సెలవులు ప్రకటించిన విషయాన్ని మజుందార్ తన లేఖలో ప్రస్తావించారు. జనవరి 22వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. జనవరి 22న రామాలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ ఆ అద్భుత ఘట్టాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం కల్పించాలని మజుందార్ తన లేఖలో కోరారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రోజైన జనవరి 22వ తేదీన అసోం, ఒడిషా రాష్ట్రాలు హాఫ్ డే హాలిడే ప్రకటించాయి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, భీమా కంపెనీలు, కొన్ని ఆర్ధిక సంస్థలు, రీజినల్ రూరల్ బ్యాంకులు హాఫ్ డే హాలిడే ప్రకటించాయి.
బెంగాల్ సీఎం మమత బెనర్జీ జనవరి 22న ఓ ప్రత్యేక ర్యాలీలో పాల్గొంటున్నారు. ర్యాలీ ఫర్ హార్మొనీ పేరుతో ఈ ర్యాలీ చేపట్టనున్నారు. సౌత్ కోల్కతాలోని హజ్రా క్రాసింగ్ నుంచి పార్క్ సర్కస్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ అనంతరం ఆ ప్రాంతంలో ఓ బహిరంగ సభ జరగనుంది. ఈ ర్యాలీని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న ర్యాలీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ర్యాలీని ఆపుచేయాలని కోరుతూ బీజేపీ నేత సువేంధు అధికారి హైకోర్టును ఇటీవలే ఆశ్రయించారు. ఈ విషయంలో బీజేపీకి చుక్కెదురయింది. బీజేపీ పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. దీంతో బీజేపీ నేతలు స్వరం మార్చారు. జనవరి 22న బెంగాల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అంటున్నారు.