తెలంగాణ(Telangana)లో కానిస్టేబుల్ నియామకాలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.మెయిన్స్ పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలు తొలగించి, తిరిగి వాల్యుయేషన్ (Evaluation) చేసి జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడాన్ని తప్పుబట్టిన కోర్టు.. మళ్లీ మూల్యాంకనం చేసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. కాగా, కానిస్టేబుల్ ఉద్యోగా(Constable job)ల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను అక్టోబరు 4న TSLPRB విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
వీరిలో 12,866 మంది పురుషులు.. 2,884 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీచేసింది. అనంతరం రాత పరీక్షలను నిర్వహించింది. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. కోర్టులో వేర్వేరుగా 6 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పి.మాధవీదేవి (P. Madhavi Devi) విచారణ చేపట్టారు. ప్రశ్నపత్రం రూపొందించడంలో నియామక మండలి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. అందువల్ల తెలుగు అనువాదం (Telugu translation)లేని 3 ప్రశ్నలను, తప్పుగా ఉన్న ప్రశ్నను తొలగించాలంటూ పోలీసు నియామక మండలిని ఆదేశించారు. పిటిషన్లను అనుమతిస్తూ తీర్పును వెలువరించారు.