High Command చేతిలో బంతి.. సీఎం ఎంపిక బాధ్యత అప్పగిస్తూ తీర్మానం
సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని కాంగ్రెస్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు.
CLP Leader: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. గచ్చిబౌలిలో గల ఎల్లా హోటల్లో 64 మంది ఎమ్మెల్యేలతో హైకమాండ్ ప్రతినిధులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, గత సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
సీఎం (CM) ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏకవాఖ్య తీర్మానం చేశారు. దానిని ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు. రేవంత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ ఎన్నుకోనుందని స్పష్టంచేశారు. దీంతో సీఎం ఎవరు కాబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదాయం ప్రకారం సీల్డ్ కవరల్లో ప్రకటించనుంది.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డారు. సీఎం పదవీ ఇస్తామని హైకమాండ్ మాట ఇచ్చిందనే వార్తలు వినిపించాయి. మరి ఇప్పుడు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోనుందో చూడాలి. రేవంత్ రెడ్డితోపాటు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా తామేమి తక్కువ కాదని అంటున్నారు. మరి వీరిలో ఎవరికీ సీఎం పదవీ దక్కుతుందో చూడాలి.