»Heavy Rain Forecast For Hyderabad Minister Ktr Urgent Review
Minister KTR: హైదరాబాద్కు భారీ వర్ష సూచన..మంత్రి కేటీఆర్ అత్యవసర సమీక్ష
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వర్షాకాలం(Rainy season) నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ఆదేశించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన(Heavy Rain) నేపథ్యంలో ఆయన జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం అయ్యారు. వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. వార్డు కార్యాలయాల వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు.
వర్షాలపై అధికారులతో కేటీఆర్(KTR) సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు పారిశుధ్య కార్మికులతో భోజన సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్మికుల సేవలకు ప్రతి అధికారీ అభినందనలు తెలపాలన్నారు. నగర పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
మరోవైపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ(Weather department) ఆరెంజ్ అలెర్ట్(Orange Alert) జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.