Gruhajyoti: గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ సిలిండర్‌తోపాటు గృహావసరాలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా అందించే గృహలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రారంభించనున్నారు. వీటికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది. అయితే హైదరాబాద్ మహానగరంలో గృహలక్ష్మి పథకం మొదటగా 11 లక్షల మంది వినియోగదారులకే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ వివరాలన్ని ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చేరినట్లు సమాచారం. దీంతో మార్చి నెలలో ఈ 11 లక్షల మందికి మాత్రమే సున్నా బిల్లులు జారీ కానున్నాయి.
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు 30 లక్షల వినియోగదారుల వివరాలను పరిశీలన పూర్తి చేసిన అధికారులు.. వాటిని సీజీజీకి సమర్పించారు. ఇందులో నగరానికి చెందిన వినియోగదారులు 11 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఆహారభద్రత కార్డు తప్పనిసరి చేయడంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో 55 శాతం మందికి మాత్రమే గృహజ్యోతి వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గత డిసెంబర్ ఆఖరులో ప్రారంభించిన ప్రజాపాలనలో జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 19.85 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో గృహజ్యోతి మ్యాపింగ్ ప్రక్రియ 11 లక్షల వరకే జరిగినట్లు తెలుస్తున్నది.
మరో 8.85 లక్షల దరఖాస్తుదారులు ఏమయ్యాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం 99 శాతం పూర్తయినట్లు చెబుతున్నారు. కాగా, 16 లక్షల మంది వరకు అర్హులు ఉంటారని అంచనా వేసినప్పటికీ.. ఆహారభద్రత కార్డు ఉన్న వాటి వివరాలనే సీజీజీకి సమర్పించడంతో లబ్ధిదారులు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.