చాలా సార్లు మనం వాడే మొబైల్ నెట్‌వర్క్‌ల విషయంలో కనెక్టివిటీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే మన బాధను పట్టించుకునే వారే ఉండరిక్కడ. కానీ అమెరికాలో పది గంటల పాటు మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీలో ఇబ్బందులు వచ్చిన కారణంగా ఓ సంస్థ వినియోగదారులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది.
AT&T to give billing credits to consumers : మొబైల్ నెట్‌వర్క్‌ల్లో అంతరాయాలు రావడం, సరిగ్గా పని చేయకపోవడం మన దగ్గర సర్వ సాధారణమైన విషయం. అయితే అమెరికాలో ఏటీ అండ్ టీ (AT&T)అనే సంస్థ మాత్రం తమ నెట్‌వర్క్‌లో పది గంటల పాటు సమస్యలు ఎదురైనందుకుగానే వినియోగదారులకు ఐదు డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ముందుకు వచ్చింది.
అమెరికా వ్యాప్తంగా ఏటీ అండ్‌టీ సంస్థ 5జీ నెట్వర్క్ని అందిస్తుంది. వీరికి ఇక్కడ 290 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. గత వారంలో తమ వైరలెస్ సేవల్లో చాలా సార్లు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలు దాదాపుగా 10 గంటలకంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ప్రభావానికి లోనైన వినియోగదారులు అందరికీ తాము ఐదు డాలర్ల చొప్పున పరిహారం చెల్లిస్తామని సంస్థ వెల్లడించింది.
షికాగో, లాస్ ఏంజలస్, న్యూయయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్, బ్రూక్లిన్ సహా పలు ప్రధాన ప్రాంతాల్లోని వినియోగదారులు ఈ నెట్వర్క్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ సంస్థ పోస్ట్‌పెయిడ్ ఖాతాదారులుగా ఉన్న వారికి వచ్చే రెండు బిల్లింగ్ సైకిళ్లలో ఈ మొత్తాన్ని జమ చేస్తామని తెలిపింది. అలాగే ప్రీపెయిడ్ యూజర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూస్తున్నట్లు తెలిపింది. నెట్‌వర్క్‌లో ఇబ్బందులు తలెత్తినప్పుడు వినియోగదారుల్లో ఉండే ఫ్రస్టేషన్‌ని తాము అర్థం చేసుకోగలమని ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని సంస్థ వెల్లడించింది.