భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం (Independence day) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటుగా హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్లో భారీ రాయితీలను కల్పించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ ధరలో 50 శాతం రాయితీని ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సజ్జనార్ చేసిన ట్వీట్:
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను #TSRTC ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్(Hyderabad) నగరంలో టి-24 టికెట్‌ను కేవలం రూ.75లకే ఆ రోజు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. పిల్లలకు టి-24 టికెట్‌ను రూ.50లకే అందించనుంది. ఆ బంపరాఫర్లన్నీ కూడా ఆగస్టు 15న అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాత్రమే వర్తించనున్నట్లు పేర్కొంది. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజు (Independence day) హైదరాబాద్ సిటీలో ఎక్కువ మంది ప్రయాణలు చేస్తారు. ఆ రోజు పర్యాటక ప్రాంతాలు, పార్కులు రద్దీగా ఉంటాయి.
అందుకే టీ24 టికెట్ (T24 ticket)పై భారీ రాయితీని టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రకటించింది. ఆ టికెట్ ను పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.50లకే అందించనుంది. ఈ రాయితీలు ఉపయోగించుకుని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలు పాల్గొనాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. రాయితీల గురించి పూర్తి వివరాలను టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని తెలిపారు.