»Former Dravida University Vc Ravwa Srihari Passes Away
Hyderabad : ద్రావిడ యూనివర్సిటీ మాజీ వీసీ రవ్వా శ్రీహరి కన్నుమూత
ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు, నిఘంటు నిర్మాణకర్త ఆచార్య రవ్వా శ్రీహరి (Ravva srihari) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ మలక్‌పేటలో ఆయన కన్నుమూశారు.
సుప్రసిద్ధ సాహితీవేత్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ యూనివర్సిటీ (Dravida University) మాజీ వీసీ ఆచార్య రవ్వా శ్రీహరి (Ravva srihari) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య అనంతలక్ష్మి, కుమారులు రమేశ్, శివకుమార్, పతంజలి ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన వీరు తండ్రి మరణ వార్తతో హైదరాబాద్ (Hyderabad) బయలుదేరారు.
రవ్వా శ్రీహరి మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, (Authors) సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీహరి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా (Nalgonda District) వలిగొండంలోని వెల్వర్తి. చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన ఐదో తరగతితోనే చదువు ఆపేసి కులవృత్తిని చేపట్టారు. ఓ రోజు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠం విడుదల చేసిన ప్రకటన చూసి విద్యాపీఠంలో చేరారు. ఆ తర్వాత సీతారాంబాగ్ (Sitarambagh) సంస్కృత కళాశాలలో డీవోఎల్, బీవోఎల్ వ్యాకరణం అభ్యసించి తర్క, వ్యాకరణ, విశిష్ట అద్వైత, వేదాంత శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు.పతంజలి ‘మహా భాష్యాంతర’ వ్యాకరణాన్ని నేర్చుకున్నారు. తెలుగు పండిట్ కోర్సు, బీఏ, ఎంఏ కూడా పూర్తిచేశారు.
‘భాస్కర రామాయణం’పై పరిశోధన చేసి ఓయూ నుంచి పీహెచ్డీ(Ph.D) పట్టా అందుకున్నారు. ఆ తర్వాత అధ్యాపకుడిగా పనిచేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా, తెలుగు శాఖ అధ్యక్షుడిగా, డీన్‌గా 17ఏళ్లు సేవలందించారు. ‘శ్రీహరి నిఘంటువు (Dictionary of Srihari)’, ‘అన్నమయ్య పదకోశం’, ‘సంకేత పదకోశం’, ‘నల్గొండ జిల్లా మాండలిక పదకోశం’, ‘వ్యాకరణ పదకోశం’ వంటి నిఘంటువులతోపాటు మరెన్నో రచనలు చేశారు. నిఘంటువుల్లో లేని పదాలు కనుగొని, కొత్త పదాలతో నిఘంటువు రాసిన ఆయన బంగారు పతకం సాధించి వ్యాకరణ సార్వభౌముడిగా పురస్కారం అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.