రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంస్కారహీనంగా మాట్లాడారని ఈటల మండిపడ్డారు. విద్యార్థి దశలోనే ఉద్యమాలు చేశానని ఈటల చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి పాలక కమిటికీ వ్యతిరేకంగా ఉద్యమిస్తే.. తనతో పాటు మరికొందరిని రెండుసార్లు జైలులో పెట్టారని వివరించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలకు హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etala Rajender) సమాధానం చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై తెలంగాణ కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా బీఆర్ఎస్(BRS) నేతలు బాధ పడ్డారని గుర్తుచేశారు. తాను రాజకీయంగా మాట్లాడానని స్పష్టం చేశారు. ఎక్కడా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదని ఈటల అన్నారు . నిన్నటినుంచి ఇష్టానుసారం రేవంత్ రెడ్డి సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు కన్నీళ్లు పెట్టడం మంచిది కాదని సెటైర్ వేశారు. అసలు రేవంత్ కన్నీళ్లు పెడతారని తాను అనుకోలేదని అన్నారు.
ఒక ధీరుడు, పోరాట యోధుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టబోడని తెలిపారు. తాము ప్రజల కోసం జైలుకు పోతే.. రేవంత్ ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని విమర్శించారు.తెలంగాణ ఉద్యమంలో నిత్యం రోడ్లమీద మేం కొట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారంటూ రేవంత్ రెడ్డిని ఈటల ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పంచన చేరి, ఉద్యమానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తమపై వందల కేసులు నమోదయ్యాయని, మహబూబ్ నగర్(Mahbub Nagar), కరీంనగర్ జైళ్లలో శిక్ష అనుభవించామని ఈటల రాజేందర్ తెలిపారు.రేవంత్ రెడ్డి మీరు ఎందుకోసం జైలుకు పోయారని ఈటల ప్రశ్నించారు. ఓటుకు నోటు (Note for vote) కేసులో జైలుకు పోయారు, మరో కేసులో జైలుకు పోయుంటారు కానీ ప్రజల కోసం ఏనాడూ జైలుకు పోలేదని మండిపడ్డారు.