Etala Rajender, Bandi Sanjay: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈ రోజు శుభసూచకం అని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. ఓరుగల్లు గడ్డ మీద నుంచి వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుంటామని తెలిపారు. ప్రధాని మోడీ అందుకోసమే ఇక్కడికి వచ్చారని తెలిపారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ విజయ్ సంకల్ప సభ వేదికపై ఈటల రాజేందర్ మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఇక్కడ ప్రజానీకం కోరుకుంటున్నారని వివరించారు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగిరే సమయం వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు. కొన్ని పత్రికుల, చానెళ్లు విష ప్రచారం చేస్తున్నాయని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల బతుకు.. కన్నీళ్లు తనకు తెలుసని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి, బీజేపీని గెలిపించాలని కోరారు. బంగారు తెలంగాణను కేసీఆర్ మాటల్లో చేశారని.. చేతల్లో బీజేపీ చేసి చూపనుందని తెలిపారు.