»Cm Revanth Reddy Good News For Auto And Cab Drivers In Telangana
Revanth Reddy: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
తెలంగాణలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి 10 లక్షల రూపాయల ఉచిత వైద్యంతోపాటు ఐదు లక్షల ప్రమాద బీమాను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించారు.
CM Revanth Reddy good news for auto and cab drivers in telangana
ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమాతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓలా, ఉబర్ తరహాలో టీహబ్ ద్వారా క్యాబ్ డ్రైవర్లకు సర్కార్ యాప్ అందుబాటులోకి వస్తుందన్నారు. రాజస్థాన్‌లో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్టం చేశామని, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అలాంటి చట్టాన్ని అధ్యయనం చేసి ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. విధాన నిర్ణయం తీసుకుంటామని, కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గిగ్ వర్కర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. చిరుద్యోగులకు అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
గిగ్ వర్కర్లకు కనెక్టివిటీ, ఇన్సూరెన్స్ వచ్చేలా యాప్ సేవలు అందుబాటులోకి తెస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలో ఆటో యూనియన్ ప్రతినిధులందరినీ పిలిపించి వారి సమస్యలను తెలుసుకునేందుకు నెట్ వర్క్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శనివారం గిగ్ వర్కర్లతో సమావేశం అనంతరం ఆయన ఏఐపీసీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి కార్మికుడిని ఆదుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
ఆటో యూనియన్ ను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించేందుకు ఇతర పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత నెల 27న హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల సమస్యలు తెలుసుకుంటానని చెప్పారని ప్రవీణ్ చక్రవర్తి గుర్తు చేశారు. అందులో భాగంగానే చిరుద్యోగులతో సీఎం, మంత్రులు సమావేశమయ్యారని తెలిపారు. గిగ్ యూనియన్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి సావధానంగా విన్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సంస్థలు కూడా గిగ్ వర్కర్ల గురించి కొంచెం ఆలోచించాలని, లాభాపేక్షతో కాకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గివ్ అండ్ టేక్ విధానం పాటించని బడా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. “4 నెలల క్రితం ఫుడ్ డెలివరీ బాయ్‌ని కుక్క వెంబడించి అపార్ట్మెంట్ మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. అప్పటి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని ఎదురు చూశాడు. కానీ, ఆ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. అందుకే కుటుంబ వివరాలను సేకరించి రూ. 2 లక్షలు అధికారులకు ఇస్తున్నాం’’ అని సీఎం రేవంత్ అన్నారు.