CM KCR: ధరణిని ఎలా తీసివేస్తారని సీఎం కేసీఆర్ (CM KCR) అడిగారు. ధరణి వల్లే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు చేసే అవాకులు, చెవాకులను జనాలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ధరణి ఉంటే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. ధరణి ఉంటే రైతుబంధు పడుతుంది, వడ్లు విక్రయిస్తే నేరుగా డబ్బులు పడాతాయి. ధరణి వల్లే రైతు భీమా వస్తోందని తెలిపారు. ధరణి తీసివేస్తే మళ్లీ ఫైరవీకారుల మంద వస్తోందని చెప్పారు. జనం మీద పడి దోచుకుంటారని మండిపడ్డారు. ఆసిఫాబాద్లో జరిగిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడారు.
తాను చాలా చోట్లలో పర్యటిస్తున్నానని, అక్కడ ధరణి గురించి ప్రస్తావిస్తున్నానని తెలిపారు. అందరూ ధరణి ఉండాలని ముక్తకంఠంతో చెబుతున్నారని పేర్కొన్నారు. ధరణి ఉండాలా వద్దా అని అక్కడ ఉన్న జనాలను ఉద్దేశించి అడిగారు. చేయి పైకి లేపాలని కోరగా.. అంతా లేబట్టారు. ధరణి ఉండాలని గట్టిగా అరచి మరీ చెప్పారు. ధరణిని తీసివేస్తే భూమి పట్టా కావడానికి 6 నెలల సమయం పడుతుందని వివరించారు. రైతుల కోసం ఆలోచించి ధరణిపై నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
2,3 రోజుల్లో పోడు పట్టా భూముల పంపిణీ చేపడుతామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల త్రి ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని.. రాత్రిపూట బాయి కాడికి వెళ్లి కరెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని.. ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నామని వివరించారు. ఇదివరకు ఆపద్బందు పథకం ఉండేదని.. ఆ రైతు చనిపోయిన ఏడాది దినం అయినా డబ్బులు వచ్చేవి కావన్నారు. ఇచ్చినా ఏ పది వేలు.. లేదంటే రూ.20 వేలు ఇచ్చేవారని గుర్తుచేశారు. అదే ధరణి వల్ల.. రైతు బీమా అమలు చేస్తున్నామని.. దీంతో రూ.5 లక్షలు అందుతున్నాయని వివరించారు.
గతంలో రోడ్ల సదుపాయాలు కూడా సరిగా లేవని కేసీఆర్ గుర్తుచేశారు. మంచిర్యాల- ఆసిపాబాద్ ఫోర్ లైన్ అయ్యిందని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. సంక్షేమ పథకాలను చూసి.. పొరుగున గల మహారాష్ట్ర సర్పంచ్లు గొడవ చేస్తున్నారని వివరించారు. తమకు కూడా అలాంటి పథకాలు కావాలని అంటున్నారని.. లేదంటే తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారని తెలిపారు.