Medigadda : మేడిగడ్డ దగ్గర ఉద్రిక్తత.. పోలీసులకు నేతలకు మధ్య తోపులాట
మేడిగడ్డ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రధాన గేటు తోసుకుని వెళ్లారు. అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతానని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.
Medigadda : మేడిగడ్డ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రధాన గేటు తోసుకుని వెళ్లారు. అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతానని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు సహా దాదాపు 200 మందితో కూడిన ప్రతినిధి బృందం బ్యారేజీని సందర్శిస్తోంది. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంది. అక్కడ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక్కో బ్లాక్‌లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు ప్రతిరోజూ ఐదు వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తారు. మేడిగడ్డను సందర్శించిన అనంతరం దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీని కూడా బృందం సందర్శించనుంది.
అన్నారం బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్యలు ప్రాజెక్టు స్థితిగతులను మీడియాకు వివరించనున్నారు. మరికొందరు నీటిపారుదల నిపుణులు బీఆర్ఎస్ బృందంతో కలిసి మేడిగడ్డను సందర్శించనున్నారు. త్వరలో మరికొందరు నిపుణులు కూడా వి.ప్రకాష్ నేతృత్వంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. కాగా, ఫిబ్రవరి 13న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మేడిగడ్డలో పర్యటించి ప్రాజెక్టులో లోపాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పర్యటన ద్వారా వాస్తవాలు వెల్లడిస్తామని బీఆర్ఎస్ చెబుతోంది.