BRS Party: అగ్గువకే బీఆర్ఎస్కు భూమి.. రూ.500 కోట్ల భూమి రూ.40 కోట్లకే కేటాయింపు
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని బదలాయిస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు మాత్రం ఈ విషయం దాచిపెట్టారు.
BRS Party: చేతిలో అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు. తమకు అనుగుణంగా విధి విధానాలు మార్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రుజువు అయ్యింది. రూ.వందల కోట్ల విలువ చేసే భూమిని అధికార పార్టీ అగ్గువకే కొట్టేసింది. దీనికి సంబంధించి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న.. మీడియా సమావేశంలో మంత్రి చెప్పకపోవడంతో సందేహాలు వస్తున్నాయి. అధికార పార్టీ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.
ఇదీ విషయం..
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట (kokapet) గ్రామంలో 239, 240 సర్వే నంబర్లలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి బదలాయించాలని ఇటీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ భేటీలో భూ పరిపాలన శాఖ ప్రతిపాదన చేయగా.. మంత్రివర్గం ఆమోదించింది. ఇక్కడ నేతలు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇవ్వడానికి ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స అండ్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్ మెంట్’ ఏర్పాటు చేస్తారట. ఇందులో కాన్ఫరెన్స్ హాళ్లు, లైబ్రరీ, వసతి, సెమినార్ రూమ్స్ ఉంటాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారని.. ఓకే అంటూ భూ పరిపాలన శాఖ పెట్టిన నోట్‌కు మంత్రివర్గం అంగీకరించింది. భూమిని హెచ్ఎండీఏ నుంచి స్వాధీనం చేసుకుని.. బీఆర్ఎస్ పార్టీకి (BRS) బదలాయిస్తామని తెలిపింది.
సందేహాం ఇలా..?
మంత్రివర్గ సమావేశం జరిగిన మంత్రి హరీశ్ రావు (Harish Rao) క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. 111 జీవో రద్దు, వీఆర్ఏల రెగ్యులరైజేషన్ అంటూ పలు అంశాలను ప్రకటించారు. బీఆర్ఎస్ భూమి కేటాయింపు అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. భూమి కావాలని బీఆర్ఎస్ ప్రతిపాదన.. రెవెన్యూ శాఖ అంగీకారం.. మంత్రివర్గం ముందు నోట్ పెట్టడం.. మంత్రివర్గం ఆమోదం గురించి తెలియజేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
కాంగ్రెస్ పేరు చెప్పి.. కేటాయింపు
తక్కువ రేటుకే భూమి దక్కించుకున్న బీఆర్ఎస్ (BRS).. అందుకు కాంగ్రెస్ పార్టీ పేరు చెబుతోంది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలం బోయిన్ పల్లి గ్రామంలో 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలో జాతీయస్థాయిలో మానవ వరనుల అభివృద్ధి సంస్థ కోసం 10 ఎకరాల 15 గుంటల భూమిని ఎకరం రూ.2 లక్షల చొప్పున అప్పట్లో ఏపీ పీసీసీకి కేటాయించిన విషయాన్ని భూ పరిపాలన శాఖ నోట్లో పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 28వ తేదీన టీపీసీసీకి పనర్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. కాంగ్రెస్‌కు బోయిన్ పల్లిలో ఇచ్చినట్టుగా కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపు అని పేర్కొంది.
రూ.460 కోట్ల లాభం
వాస్తవానికి కోకాపేటలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. భూ పరిపాలన శాఖ ప్రతిపాదన మేరకు క్యాబినెట్ రూ.40 కోట్లు చెల్లించేలా ఆమోదించింది. దీంతో అధికార పార్టీ రూ.460 కోట్ల తక్కువకు భూమిని దక్కించుకుంది. పార్టీ జిల్లా కార్యాలయాల కోసం గజానికి రూ.100 చొప్పున తీసుకుని బదిలీ చేసుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4935 చదరపు గజాల భూమిని నామమాత్రపు ధరకు సొంతం చేసుకున్నారని తెలిపింది. ఇప్పుడు కోకాపేటలో ఏకంగా 11 ఎకరాల భూమి బదలాయింపు చేసుకున్నారని అంటున్నారు.