తెలంగాణ(Telangana)లో ఎన్నిగల నగారా మోగిన వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. పార్టీ కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఈ నెల 15న పార్టీ అధినేత సీఎం కేసీఆర్(CM KCR)తెలంగాణ భవన్లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించి, ఆ సాయంత్రం హుస్నాబాద్(Husnabad)లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
మరుసటి రోజు భువనగిరి(Bhuvanagiri), జనగామ నియోజక వర్గాల్లో బహిరంగ సభలు, 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, ఆ రోజు సాయంత్రం మేడ్చల్‌లో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. కాగా, గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్(Hyderabad)కు ఈశాన్యాన ఉన్న హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక గజ్వేల్(Ghazwal), కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 9న ఆ రెండు చోట్లా నామినేషన్ వేయనున్నారు. అయితే, ఆనవాయితీ ప్రకారం ఆయన తొలుత సిద్దిపేట నియోజకవర్గం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక
తొలుత గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి (Kamareddy) లో నామినేషన్ వేస్తారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. నామినేషన్లు వేసే సమయంలో జాగ్రత్తలు.. ఎన్నికల నియామళి, ప్రచార వ్యూహాలను అభ్యర్థులకు కేసీఆర్ వివరించనున్నారు. అదే సమయంలో అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)ను కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఆసరా ఫించన్లు, రైతుబంధు సాయం పెంపు వంటి రైతు, మహిళ, బీసీ, మైనారిటీలు, యువతను ఆకర్షించేలా పలు హామిలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.