Indrakaran Reddy : లోక్సభ ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత కేసీఆర్కు పంపారు. అంతేగాక, వెంటనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపా మున్షీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పి ఇంద్రకరణ్ రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా ఈ మాజీ మంత్రి కూడా పార్టీని వదలడం ఆ పార్టీని కొంత ఇబ్బందికర పరిస్థితిలోకి తోసినట్లైంది.
ఇప్పటికే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది ఎన్నికల సంఘం. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం అమలులో ఉండనుంది.
ఈసీ నిషేధం స్పందించిన కేసీఆర్
ఈ విషయంపై కేసీఆర్ స్పందించారు. నా మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ నేతలు కొన్ని మాటలను ఎంపిక చేసుకుని ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఇంగ్లీష్ అనువాదం సరికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించానని కేసీఆర్ స్పష్టం చేశారు.