BRS, Congress: తెలంగాణ గట్టు మీద రాజకీయ వేడి రంజుకుంది. ఎడతెగని వర్షం కురుస్తోన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు తమ వ్యుహా రచనలో మునిగాయి. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల సమయం ఉండటంతో చకచకా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఓ కొలిక్కి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆగస్ట్ సెకండ్ వీక్లో ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.
మూడు విడతలుగా
వాస్తవానికి జూలై నెలలోనే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అధిక శ్రావణ మాసం కావడం.. మంచి రోజులు కాకపోవడంతో గులాబీ బాస్ వెనకడుగు వేశారు. ఆగస్ట్ 15 తర్వాత నిజ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అప్పుడే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కేసీఆర్ (kcr) క్లారిటీతో ఉన్నారు. అయినప్పటికీ మూడు విడతలుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. వివాదాలు లేని, పనితీరు బాగున్న ఎమ్మెల్యేలతో తొలి జాబితాను ప్రకటిస్తారు. అలా 30 నుంచి 40 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రానుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతల, కార్యకర్తల వ్యతిరేకత వస్తోంది. అలా 20-25 సీట్లు ఉన్నాయి. దీంతో వారిని మార్చడమా..? లేదంటే కొనసాగించే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. వీరి జాబితా.. ప్లస్ తిరుగుబాటు, నిరసనలు వచ్చిన వారికి సర్దిచెప్పి.. రెండు, మూడు జాబితా విడుదల చేస్తారని తెలిసింది.
60 మందితో ఫస్ట్ లిస్ట్
కాంగ్రెస్ (congress) పార్టీ కూడా అభ్యర్థుల జాబితాపై పోకస్ చేసింది. ఫస్ట్ లిస్ట్ 50- 60 మందితో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy), ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలుతో చర్చిస్తున్నారట. 25-30 సీట్లు బీసీలకు కేటాయిస్తారని తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పట్టుంది. బీసీలకు టికె్లు ఇచ్చి.. మిగతావారిని కూడా తమ వైపునకు తిప్పుకోవాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వాములు ఉన్నందున, కొన్ని నియోజకవర్గాలను వారికి వదిలేయాల్సి వస్తోంది.
లేటుగా బీజేపీ
బీజేపీ (bjp) పరిస్థితి మరోలా ఉంది. షెడ్యూల్ వచ్చే వరకు ఆ పార్టీలో ఎంతమంది ఉంటారో స్పష్టత లేదు. దీంతో ముందుగా ప్రకటిస్తే ఇబ్బంది అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే ప్రచారం జరగడం.. దానికి బలం చేకూర్చేలా పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ జాబితా రిలీజ్ చేసిన తర్వాత 15-25 మంది బీజేపీ ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీతో కమ్యునిస్టులు అంటిముట్టనట్టుగానే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యునిస్టులతో కలిసి పనిచేసిన.. బీఆర్ఎస్ తర్వాత విమర్శించింది. దీంతో ముందే దూరం ఉండాలని కమ్యునిస్టులు నిర్ణయం తీసుకున్నారట.