కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao)కు ఎన్నిక విషయంలో హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది.ఎమ్మెల్యేగా ఎన్నిక అనర్హత హైకోర్టు తీర్పు విషయం తెలిసిందే. ఈ తీర్పు విషయంలో స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని వనమా హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. తీర్పును తాను సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేస్తానని, ఈ మేరకు అప్పీల్‌కు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఆయనకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. ఎన్నికలో రెండో అభ్యర్థిగా నిలిచిన జలగం వెంకట్రావు(Jalagam Venkatarao)నే 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశించింది.హైకోర్టు (High Court) తాజా నిర్ణయంతో జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. జలగం వెంకట్రావు నిన్న ఎన్నికల కమీషనర్ వికాస్‌రాజ్‌ను కలిశారు. 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ (Congress party) తరపున గెలిచారు. అనంతరం బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. బీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా గెలుపును సవాల్ చేస్తూ జలగం 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్(Affidavit)లో తప్పుడు నివేదిక సమర్పించారని జలగం ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ అనంతరం వనమా ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది