»Bittiri Satthi Meets Ktr This Is A Big Draw For Their Votes
Bithiri Sathi: కేటీఆర్‌తో బిత్తిరి సత్తి భేటీ..వారి ఓట్ల కోసం పెద్ద స్కెచ్చే ఇది!
నేడు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్, బిత్తిరి సత్తి భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముదిరాజ్ ఓటర్లను ఆకర్షించేందుకే బిత్తిరి సత్తిని కేటీఆర్ తమ వైపు తిప్పుకుంటున్నారే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీ నాయకుల వ్యూహ ప్రతివ్యూహాల జోరు ఎక్కువవుతోంది. బీఆర్ఎస్ మరింత స్పీడ్‌గా దూసుకుపోతోంది. ఏ వర్గం వారినీ అసంతృప్తి పరచకుండా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరైనా అసంతృప్తితో ఉన్నారని తెలిస్తే చాలు వారిని బుజ్జగించి తమ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తోంది. బహిరంగంగా ఎవరైనా వ్యతిరేకత తెలిపినా వారి దగ్గరికి చేరి మంతనాలు జరుపుతోంది.
ఈ క్రమంలోనే నేడు ప్రగతి భవన్లో బిత్తిరి సత్తితో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ముదిరాజ్ వర్గానికి చెందిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్‌తో కేటీఆర్ కొంతసేపు ముచ్చటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆ మధ్య ముదిరాజ్ మహాసభ నిర్వహించారు. ఆ సభలో బిత్తిరి సత్తి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముదిరాజు వర్గంవారంతా ఆయనకు అండగా నిలిచారు.
ముదిరాజులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని, దురదృష్టవశాత్తు వారికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని బిత్తిరి సత్తి ఆ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇచ్చే నామినేటెడ్ పోస్టులు సప్పగా ఉంటాయంటూ బిత్తిరి సత్తి ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముదిరాజులం 60 లక్షల జనాభా ఉన్నామని, 115 సీట్లలో ఒక్క సీటు కూడా ముదిరాజులకు ఇవ్వలేదని బిత్తిరి సత్తి మండిపడ్డాడు. బిత్తిరి సత్తి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్న క్రమంలో కేటీఆర్ భేటీపై ఆసక్తి నెలకొంది.
అయితే వారి భేటీ సారాంశం ఏంటన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై బిత్తిరి సత్తి ఇంకా స్పందించాల్సి ఉంది. బీఆర్ఎస్లో బిత్తిరి సత్తి చేరుతాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బిత్తిరి సత్తిని బీఆర్ఎస్లోకి చేర్చుకుంటే ముదిరాజ్‌ల ఓట్లన్నీ కాపాడుకున్నట్లు అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కేటీఆర్ పెద్ద స్కెచ్చే వేశారని గుసగుసలాడుకుంటున్నారు. అయితే బిత్తిరి సత్తితో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేటీఆర్ పాట పాడించుకుంటారేమోనని మరికొందరు చెబుతున్నారు.